శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు హల్‌చల్ చేశారు. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివరాలలోకి వెళితే అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ‘మొహబత్ కి దుకాణ్ ‘ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. సభలో కూర్చున్న కొందరు ఖలిస్థానీ సానుభూతిపరులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే, ఆ నినాదాలకు రాహుల్ స్పందిస్తూ.. ”విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు” అని అన్నారు. ఆ వెంటనే సభలోని కాంగ్రెస్ మద్దతుదారులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు. అనంతరం దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. ”కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరిపైనా అభిమానం ఉంటుంది. మేం ఎవరి పట్లా కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించబోం. ప్రతి వ్యక్తి ఆవేదనను వింటాం” అని అన్నారు. కాగా,ఖలిస్థానీ సానుభూతిపరులు నినాదాలు చేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.