న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కంపెనీ అత్యంత తక్కువ ధరకు కాశ్మీర్ జోజిల్లా పాస్ ప్రాజెక్టుకు టెండర్ వేయడం వల్ల 5 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దేశవిదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతూ నిర్దిష్ట సమయం కంటే ముందే పనులు పూర్తి చేస్తుందన్న రికార్డులు సొంతం చేసుకున్న మేఘా పార్లమెంట్ సాక్షిగా ప్రశంసలందుకుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2022-23 బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో భాగంగా మంగళవారం దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌లో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక జోజిల్లా పాస్ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశవిదేశాల్లో పేరుపొందిన అనేక కాంట్రాక్టు సంస్థల నుంచి టెండర్ కోరినట్లు గడ్కరీ చెప్పారు. కానీ మేఘా సంస్థ మాత్రం అత్యంత తక్కువ ధరకు ఈ పనికి టెండర్ వేసిందని గడ్కరీ తెలిపారు. అత్యంత క్లిష్టమైన వాతావరణం ఉండే జోజిల్లా పాస్‌లో మేఘా సంస్థ శరవేగంగా పనులు చేపట్టి జంట టన్నెల్స్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రెండు విజయాలు సాధించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..