Friday, November 22, 2024

హైడ్రోజన్‌ ఉత్పత్తి రంగంలోకి ‘మేఘా’ గ్రూప్.. 35 మిలియన్‌ యూరోల పెట్టుబడికి సన్నాహాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఫ్యూచర్ ఇంధనంగా పరిగణిస్తున్న హైడ్రోజన్‌ ఉత్పత్తి రంగంలోకి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రవేశించింది. మేఘా గ్రూపు కంపెనీ డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ ఈ రంగంలో 35 మిలియన్‌ యూరోల (దాదాపు రూ.300 కోట్లు) పెట్టుబడిని పెట్టేందుకు నిర్ణయించింది. ఇప్పటికే హైడ్రోకార్బన్స్‌ రంగంలో అన్ని విభాగల్లోనూ విస్తరించిన మేఘా గ్రూపు ఈ కొత్త ఇంధన రంగంలో ప్రవేశించడం ద్వారా విశ్వవ్యాప్తంగా తన సత్తాను చాటుకుంది. ఇటలీలోని పియుచెంజాలో జరిగిన డ్రిల్‌మెక్‌ బోర్డు సమావేశంలో హైడ్రోజన్‌ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. హైడ్రోజన్‌ ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అయిన ఎలక్ట్రోలైసిస్‌, పైరోలైసిస్‌లను వినియోగించడంతో పాటు కార్బన్‌ క్యాప్చర్‌, స్టోరేజి వ్యవస్థ డిజైన్‌, నిర్మాణాలను, జియో థర్మల్‌ ఎనర్జీ ఉత్పత్తిని డ్రిల్‌ మెక్‌ చేపట్టనుంది. ఇందులో భాగంగా ఇడ్రోజెన అనే స్టార్ట్‌అప్‌ కంపెనీని డ్రిల్‌మెక్‌ ప్రారంభించింది.

ఈ కంపెనీ అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ ఉత్పత్తి కోసం పైరోలిటిక్‌ కన్వర్టర్‌ను అభివృద్ది పరిచి తయారు చేస్తుంది. ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌లో 30 ఏండ్లకు పైగా అనుభం ఉన్న ఇడ్రోజెన ఇంజినీర్లు కన్వర్టర్‌ను డిజైన్‌ చేశారు. ఎలాంటి కాలుష్య కారకాలను వినియోగించకుండానే పైరాలిసిస్‌ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఈ కన్వర్టర్‌ ఉత్పత్తి చేస్తుంది. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ, అందరికీ అందుబాటులో ఇంధనం తదితర లక్ష్యాలతో జరుగుతున్న ఇంధనరంగ పరివర్తనలో భాగంగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ ఛైర్మన్‌ బొమ్మారెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ”ఈ కొత్త ఆవిష్కరణ చేస్తున్న డ్రిల్‌మెక్‌ టీమ్‌ను అభినందిస్తున్నాను. వేగంగా వద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్‌ టెక్నాలజీలలో వారంతా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను”. అని అన్నారు. ఈ కొత్త టెక్నాలజీని అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయడం వల్ల తక్కువ పీడనంతో నిర్వహించడంతో పాటు, కనీస శిక్షణతో సురక్షితంగా వినియోగించవచ్చు. పునరుత్పాదక ఇంధనంతో పనిచేయడం వల్ల కాలుష్య కారకాల వినియోగం ఉండదు. అలాగే వ్యర్థాల ఉత్పత్తి కూడా జరగదు. పరిశ్రమల్లో వినియోగంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థల్లో వినియోగించడగలగడం వంటి బహుళ ప్రయోజనాలకు అవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు అని శ్రీనివాస్‌ అన్నారు. డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ సీఈఓ సిమోన్‌ ట్రెవిసాని మాట్లాడుతూ ”దేశంలో ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement