భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒక అవగాహన ఒప్పందంపై(ఎంవోయూ) సంతకం చేసినట్టు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏరోస్పేస్ కంపెనీ జీయీ ఏరోస్పేస్ గురువారం ప్రకటించింది. సదరు ఒప్పందాన్ని ఒక కీలకమైన మైలురాయిగా అమెరికా ఏరోస్పేస్ కంపెనీ వర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంలో ఒప్పందం ఒక కీలకమైన అంశంగా ఉపకరిస్తుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం జీయీ ఏరోస్పేస్, హెచ్‌ఏఎల్ సంస్థలు భారత్‌లో సంయుక్తంగా ఎఎఫ్414 ఇంజిన్లను తయారు చేస్తాయి.
ఒప్పందానికి అవసరమైన ఎక్స్‌పోర్ట్ ఆథరైజేషన్ పొందడం కోసం అమెరికా ప్రభుత్వంతో కలసి పనిచేయడాన్ని కొనసాగిస్తానని ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల సరఫరాదారు కంపెనీ పేర్కొంది. భారత వైమానిక దళానికి చెందిన లైట్ కాంబట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే2 (ఎల్‌సీఏ ఎంకే2) ప్రోగ్రామ్‌లో భాగంగా ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఇదే విషయమై జీయీ ఏరోస్పేస్ కంపెనీ సీయీవో హెచ్ లారెన్స్ కల్ప్ మాట్లాడుతూ ”భారత్, హెచ్‌ఏఎల్‌తో మాకు ఉన్న సుదీర్ఘకాలపు భాగస్వామ్యం కారణంగా ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైంది” అని తెలిపారు. ”ఇరుదేశాల సన్నిహిత సమన్వయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోడీలకు ఉన్న దృక్పథాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఒక కీలమైన పాత్రను పోషించినందుకు మేం గర్విస్తున్నాం.
మా ఎఫ్414 ఇంజిన్లు తిరుగులేనివి. ఇరు దేశాలకు ముఖ్యమైన ఆర్థిక, జాతీయ భద్రతకు సంబంధించిన ప్రయోజనాలను సమకూరుస్తాయి. మా ఖాతాదారుల సైనిక అవసరాలకు తగ్గట్టుగా అత్యంత నాణ్యమైన ఇంజిన్లను ఉత్పత్తి చేయడంలో వారికి మేం సహకరిస్తున్నాం” అని అన్నారు. ఎల్‌సీఏ ఎంకే2 ప్రోగ్రామ్‌లో భాగంగా భారత వైమానిక దళం కోసం 99 ఇంజిన్లు నిర్మిస్తామంటూ గతంలో ఇచ్చిన మాటను త్వరతిగతిన నిలబెట్టుకోవడంలో తాజా ఒప్పందం ఉపకరిస్తుందని జీయీ ఏరోస్పేస్ తెలిపింది. జీయీ ఏరోస్పేస్ కంపెనీ నాలుగు దశాబ్దాలకు పైగా భారత్‌లో కార్యకలాపాలను సాగిస్తోంది. లైట్ కాంబట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్‌సీఏ)ను ఎఫ్404 ఇంజిన్లతో అభివృద్ధి చేసే నిమిత్తం 1986లో భారత్‌కు చెందిన ఏరోనాటికల్
డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హెచ్‌ఏఎల్‌తో కలసి పనిచేయడం ప్రారంభించింది. కంపెనీకి చెందిన ఎఫ్404, ఎఫ్414 ఇంజిన్లు ఎల్‌సీఏ ఎంకే1, ఎస్‌సీఏ ఎంకే2 ప్రోగ్రామ్‌లలో భాగంగా ఉన్నాయి. ”ఎల్‌సీఏ ఎంకే1ఏ ప్రోగ్రామ్ కోసం మొత్తంగా 75 ఎఫ్404 ఇంజిన్లు డెలివరీ అయ్యాయి. మరో 99 ఇంజిన్లకు ఆర్డర్ వచ్చింది. ఎల్‌సీఏ ఎంకే2 కోసం ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఎఫ్414 ఇంజిన్లు డెలివరీ అయ్యాయి” అని జీయీ ఏరోస్పేస్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.