కోవూరు, ప్రభన్యూస్ : దగాకోరు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై రకరకాల ముద్రలు వేసి జైళ్లలో పెడుతున్నారని విరసం నేత రచయిత అరసవిల్లి కల్యాణ కృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన 28 వ విప్లవ రచయితల సంఘం (విరసం) మహా సభలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కవులు సాహితీ వేత్తలు హాజరైనారు. ఈ సందర్భంగా కల్యాణ కృష్ణ మాట్లాడుతూ మహా సభకు ముందస్తూ అనుమతులు తీసుకున్నప్పటికీ అడ్డుకొనేందుకు పోలీసులు రకరకాల కుట్రపన్నారన్నారు. సంఘమిత్ర విద్యాలయం వేదికగా మహాసభలు జరగాల్సి ఉన్నా సంఘమిత్ర స్కూల్ గుర్తింపు రద్దు చేస్తామని యాజమాన్యాన్ని బెదిరించడం ద్వారా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన విమర్శించారు. కఠిన చట్టాలు అమలు చేయడం ద్వారా ప్రశ్నించే ప్రజా కవులు, మేధావులను జైళ్లకు పంపించడం ప్రభుత్వ ఫాసిస్తూ విధానాలకు నిదర్శనమని విమర్శించారు.
విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడు ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిపై దుర్మార్గమైన చట్టాలను ప్రయోగించడం దారుణమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడమే తమ విధానంగా పెట్టుకున్నారన్నారు. అడ్డంకులు సృష్టించినప్పటికీ 2 రోజులు పాటు జరిగే మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కవులు సాహితీ వేత్తలు మేధావులు తరలి రావడం హర్షణీయమన్నారు. కార్యక్రమ ప్రారంభంలో అరుణోదయ విమలక్క ఆడిపాడారు. అమర వీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరసవెల్లి కృష్ణ, వరలక్ష్మి, ప్రతిమ, రివెరా, పాణి, ప్రొఫెసర్ దిలీప్, శివరాత్రి సుధాకర్, ఖాసీం, రాంకీ, వర్మ, నాగేశ్వర్, రాము, కుమార్, రవీందర్, ప్రసాద్, కల్యాణ రావు, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital