Tuesday, November 19, 2024

పోలవరంపై రేపు కీలక భేటీ.. తొలిదశ అంచనా వ్యయంపై స్పష్టత

అమరావతి, ఆంధ్రప్రభ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెలువరించేందుకు అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 20న సోమవారం నిర్వహించనున్న హై పవర్‌ (ఉన్నతస్థాయి) కమిటీ సమావేశంలో ప్రాజెక్టు తొలిదశ అంచనా వ్యయం ఆమోదంతో పాటు నిర్మాణానికి ప్రధాన అవరోధంగా మారిన డయాఫ్రం వాల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువలోగా పూర్తి చేసేందుకు 2024 జూన్‌-జులై కంటే ముందు వరదలొచ్చే లోపు చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే తయారుచేసిన యాక్షన్‌ ప్లాన్‌ అమలుపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఈ మేరకు ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిపై పోలవరం ప్రాజెక్ట్‌ అధారిటీ (పీపీఏ) అధికారులు ఈ సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. కేంద్ర జలశక్తి కార్యదర్శ దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షత నిర్వహించనున్న సమావేశంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ (సీడబ్ల్యూసీ) కుశ్వీందర్‌ సింగ్‌ వోరా, జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) శివనందన్‌ కుమార్‌, సభ్య కార్యదర్శి రఘురాం, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ బాబు ఈ సమావేశంలో పాల్గొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక తీర్మానాలు ఆమోదించనున్నట్టు సమాచారం.

తొలిదశ బకాయిలు రూ 15 వేల కోట్లు

- Advertisement -

సవరించిన అంచనాలను అనుసరించి పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశ అంచనా వ్యయాన్ని రూ 31,625.38 కోట్లుగా కేంద్ర జలసంఘం ఖరారు చేసి కేంద్ర ఆర్ధికశాఖకు నివేదిక అందించింది. నిధుల విడుదలపై ఇంతవరకు ఇంతవరకు స్పష్టత రాలేదు. కేంద్ర జలశక్తి సమర్పించిన తొలి దశ అంచనా నివేదికను సమీక్షించేందుకు ఆర్ధికశాఖ రివైజ్ట్‌ కాస్ట్‌ కమిటీ(ఆర్‌ సీసీ)ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ సీసీ అడిగిన వివరాలపై ఇప్పటికే సమగ్ర నివేదిక అందించింది. ఆర్‌సీసీ మాత్రం ఇంకా ఆర్ధికశాఖ నివేదిక అందించలేదు.

ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ ఖరారు చేసిన తొలిదశ అంచనా వ్యయమైన రూ 31,625.38 కోట్లను ఆర్ధికశాఖ యధాతధంగా ఆమోదిస్తుందా, లేదంటే కోతలు విధిస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. తొలిదశ అంచనా వ్యయంలో ఇప్పటికే రూ 16,1119.57 కోట్ల విలువైన పూర్తయ్యాయనీ, మరో రూ 15,505.81 కో విలువైన పనులకు ఆమోదంతో పాటు నిధుల విడుదలపై సమావేశంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సమావేశంలో పాల్గొనే రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నిదుల విడుదల, ఆమోదంపై మరోసారి సమగ్ర వివరాలను కేంద్ర జలశక్తికి అందించనున్నారు.

డయాఫ్రం వాల్‌.. పునర్‌ నిర్మాణం వైపే మొగ్గు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన అవరోధంగా మారిన దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ పై ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో కేంద్ర జలశక్తి కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. 2020లో గడచిన 50 ఏళ్లలో వరద ఉధృతికి డయాఫ్రం వాల్‌ నిర్మామైన చోట నదీ గర్భం ఇసుక కోతకు గురైంది. ఇసుక పొరలు కొట్టు-కుపోయి గుంతలు ఏర్పడ్డాయి..ఆ గుంతల నుంచి నీటిని తోడటం పెను సవాల్‌ గా మారింది.

ఇసుక కోతకు గురై దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ కు సమాంతరగా మరో డయాఫ్రం వాల్‌ నిర్మించటమే మేలని కేంద్ర జలశక్తి ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక నివేదిక సిద్ధం కాగా.. వివిధ సంస్థలకు చెందిన ఇంజనీరింగ్‌ బృందాలు సమర్పించిన కీలక నివేదికలను కూడా మదింపు చేసే కార్యక్రమం పూర్తయినట్టు తెలిసింది. ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో వివిధ కీలక నివేదికల్లో పొందుపర్చిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో నిష్ణాతులైన ఎ.ఎస్‌.రాజు, గోపాలకృష్ణ, హర్వీందర్‌సింగ్‌, హసన్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ వేర్వేరుగా అందించిన నివేదికలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే సమాంతర డయా ఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టటమే ఉత్తమమని సాంకేతికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌ ప్రస్తుత స్థితి, దాని ఉపయోగం, మిగిలిన భాగం పటిష్టత, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య సుడిగుండాల్లా మారిన గుంతల నుంచి నీటిని తోడటం, నదీ గర్భంతో కోతకు గురయిన ఇసుకపొరల సహజసిద్ధ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన ఇంజనీరింగ్‌ నిపుణులు కూడా చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే కేంద్ర జలశక్తి తమ ప్రతిపాదనలు అందించారు.

పోలవరంలో కీలక నిర్మాణమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్లింగ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) – రాతి, మట్టికట్ట డ్యాం నిర్మించాల్సిన చోట వరద ఉధృతి వల్ల నదీగర్భంలో ఇసుక భారీ స్థాయిలో కొట్టు-కుపోయి గుంతలు ఏర్పడ్డాయి. ఇపుడా నీటిని తోడటం, ఇసుక గుంతలను పూడ్చటమే సవాల్‌ గా మారింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌ పటిష్టతపై పూర్తిస్థాయి అంచనాకు రాలేమని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

రూ 2,100 కోట్లు అవసరం

డయా ఫ్రం వాల్‌ పునర్నిర్మాణానికి రూ 2,100 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. డ్రెడ్జింగ్‌, వైబ్రో కాంపక్షన్‌ విధానాన్ని అవలంబించి ఇసుక కోత సమస్యను అధిగమించవచ్చనీ..దీనికి రూ 880 కోట్లు సరిపోతాయని ఇంజనీరింగ్‌ నిపుణులు మరో నివేదిక అందించారు. ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ కు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక దిబ్బలను డ్రెడ్జింగ్‌ చేయటం.. పంపింగ్‌ విధానంలో ఇసుకను పొరలు పొరలుగా కోతకు గురయిన ప్రాంతంలోకి జొప్పించి పూడ్చే వైబ్రో కాంపక్షన్‌ పద్దతిని అనుసరిస్తే సమస్య పరిష్కారమవుతుందని కమిటీ- అభిప్రాయపడింది. వీటన్నిటిపై సాంకేతికంగా మేధో మధనం చేసిన తరువాతనే తుది నిర్ణయం తీసుకోవాలని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్పీ) నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తికి డీడీఆర్పీ సమగ్ర నివేదిక అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement