న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎలా పని చేయాలన్న దానిపై టీపీసీసీ, కాంగ్రెస్ అన్ని అనుబంధ సంఘాలతో కలిసి దృష్టి పెట్టామని తెలంగాణా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజ్ నేతృత్వంలో జరిగిన మహిళా కాంగ్రెస్ నేతల సమావేశానికి ఆమె హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశం అనంతరం సునీతారావు మీడియాతో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి మహిళా కాంగ్రెస్ నిర్మాణం గురించి చర్చించామని తెలిపారు. తెలంగాణలో గ్రామ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేశామని చెప్పారు. 33 జిల్లాల్లో కమిటీలు వేయలేకపోయామని, 25 జిల్లాలకు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్లను నియమించామని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల్ని మభ్యపెడుతున్నాయని సునీతారావు ధ్వజమెత్తారు.
ధరల పెరుగుదలతో పేద, సామాన్య వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో తాము ఏ కార్యక్రమం చేపట్టినా ముందే అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మహిళా కాంగ్రెస్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తాము చేపట్టే కార్యక్రమాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదని స్పష్టతనిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ నుంచి అందే ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నామని ఆమె చెప్పారు. సమాజంలో సగం ఉన్న మహిళా ఓటుబ్యాంకు చాలా కీలకం కాబట్టి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కంటే ఎక్కువ పోరాట కార్యక్రమాలను మహిళా కాంగ్రెస్ చేపడుతుందని సునీత వెల్లడించారు. ఇప్పటికే 6 జిల్లాల్లో పర్యటించానని, మిగతా జిల్లాల్లోనూ పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలసుకుంటానన్నారు. కొన్ని జిల్లాల్లో డీసీసీల నుంచి సహకారం అందడం లేదని, మహిళా కాంగ్రెస్‌కు జిల్లా అధ్యక్షుల నియామకాల్లో అభ్యర్థులను ఇవ్వడం లేదని, జిల్లా కమిటీలు ఏర్పాటు కానివ్వడం లేదని ఆమె ఆరోపించారు. వీటన్నింటి గురించి మహిళా కాంగ్రెస్ అధినేత్రితో చర్చించి పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని, త్వరలోనే నెట్టా డిసౌజ్ కూడా తెలంగాణలో పర్యటిస్తారని సునీత తెలిపారు. మహిళల సమస్యలను గమనిస్తూ స్వయం సహాయక సంఘాల సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టినవేవీ సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదని, మందు-బంధు తప్పితే మరేదీ నడవడం లేదని ఆమె ఎద్దేవా చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..