Saturday, November 23, 2024

Opposition | 17న విపక్ష పార్టీల భేటీ.. బెంగళూరు వేదికగా రెండో సమావేశం

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్డీయేతర విపక్ష పార్టీలు ఐక్యతా వ్యూహానికి కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే పాట్నా వేదికగా ఐక్యగళం వినిపించిన వివిధ పార్టీలు, రెండవ సమావేశానికి సన్నద్ధమవుతున్నాయి. వచ్చేవారం (జులై 17,18న) బెంగళూరు వేదికగా రెండు రోజులపాటు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యాన జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ 24 పార్టీలకు ఆహ్వానం పంపినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు విపక్ష నేతలు పకడ్బందీ వ్యూహరచన చేయనున్నారు.

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె, మళ్లిd చాలా కాలం తర్వాత వివిధ పార్టీల నేతలు పాల్గొనే విందుకు హాజరవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యత దిశగా తొలి సమావేశం జూన్‌ 23న పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే. ఎన్సీపీలో అజిత్‌ పవార్‌ తిరుగుబాటుతో ఆ పార్టీలో చీలిక రావడంతో జులై 13న జరగాల్సిన ఈ భేటీని 17కు వాయిదా వేశారు.

విపక్ష కూటమిలోకి మరో 8 పార్టీలు..
బెంగళూర్‌ భేటీలో ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌), కేరళ కాంగ్రెస్‌ (మణి) వంటి మరో ఎనిమిది కొత్త పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ పార్టీలను కూడా విపక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఇక పాట్నాలో జరిగిన సమావేశంలో 15 విపక్ష పార్టీలు పాల్గొనగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి. తాము ఉమ్మడి అజెండాతో, రాష్ట్రాల వారీగా వ్యూహాలతో విభేదాలను విస్మరించి బీజేపీపై ఐక్యంగా పోరాడతామని పాట్నా భేటీ అనంతరం విపక్షాలు వెల్లడించాయి.

సోనియా రంగప్రవేశం..
విపక్షాలను ఏకం చేయడంలో ఎదురయ్యే సమస్యలను సోనియా గాంధీ చాకచక్యంగా పరిష్కరిస్తారని భావిస్తున్నారు. ఈనెల 17, 18న రెండు రోజుల పాటు 24 రాజకీయ పార్టీల నేతలు విపక్షాల ఐక్యతపై విస్తృతంగా చర్చిస్తారు. నరేంద్ర మోడీ సారధ్యంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై ఈ భేటీలో కసరత్తు సాగిస్తారు. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవసరమైన వ్యూహాలు, కార్యాచరణపై సమాలోచనలు సాగిస్తారు.17న తొలి రోజు సంప్రదింపులు ముగిసిన అనంతరం కర్నాటక సీఎం సిద్ధరామయ్య విపక్ష నేతలకు విందు ఏర్పాటు చేస్తున్నారు. విపక్షాల సమావేశం తేదీలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫాసిస్టు, అప్రజాస్వామిక శక్తులను ఓడించడానికి మా అంచంచలమైన సంకల్పంతో మేమంతా సిద్ధంగా ఉన్నాము. దేశం ముందుకు సాగాలి అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement