Tuesday, November 26, 2024

ఢిల్లీలో ఓబీసీ నేతల సమావేశం.. పార్టీలకతీతంగా ఎంపీలు హాజరు కావాలి : వీహెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో వెనుకబడిన వర్గాల జనాభా పెరిగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు (మంగళవారం) జరిగే ఓబీసీ నేతల సమావేశానికి పార్టీలకతీతంగా ఎంపీలందరినీ ఆహ్వానించామని వీహెచ్ తెలిపారు. ఈ సమావేశం గురించి సోనియా గాంధీకి వివరించామని తెలిపారు. దేశంలో బీసీల జనాభా 50 నుంచి 52 శాతానికి పెరిగిందన్న ఆయన, వారికి తగిన స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు.

కులాల వారీగా జన గణన చేపట్టాలని తాను చాలా సార్లు డిమాండ్ చేశానని, కులగణన చేపడతామని 2008లో హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. డబ్బు ఖర్చవుతుందని కుల గణన ఆపడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీమిలేయర్‌ను ఎత్తివేయాలని, కేంద్రప్రభుత్వంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఓబీసీ ఎంపీల కమిటీ కన్వీనర్‌గా 11 ఏళ్లు పని చేసిన తనకు వెనుకబడిన వర్గాల సమస్యలు తెలుసునని వీహెచ్ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement