న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చుతూ ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో అధిష్టానం పెద్దలను కొత్త నాయకత్వం కలుస్తోంది. మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు నేతృత్వంలోని కొత్త కార్యవర్గం, బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు అధిష్టానం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు తాను డిసెంబర్ 9న పదవీ బాధ్యతలు చేపడతానని వెల్లడించారు.
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అధిష్టానం పెద్దలతో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదంతో పాటు సహకారం కోరుతున్నానని తెలిపారు. రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం సాధించుకుంటూ సీనియర్ నేతలందరితో కలిసి ముందుకెళ్తానని, పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ బృందంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్ కూడా గిడుగు వెంట ఉన్నారు.