Tuesday, November 26, 2024

హైదరాబాద్‌లో మరో అమెరికా కంపెనీ ప్రారంభం

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు బారులు తీరుతున్నారు. తాజాగా మరో అమెరికా కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్‌ నాన‌క్ రాం గూడ‌లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. బీఎస్‌ఆర్‌ టెక్‌పార్క్‌లో రూ.1,200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఇందులో ఉద్యోగ అవ‌కాశాలు రానున్నాయి. తొలుత 1,000 మందికి, భ‌విష్య‌త్తులో మరో 4,000 మందికి ఈ సంస్థ ద్వారా ఉపాధి లభిస్తుంది. ఈ అమెరికా సంస్థ ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగు, ఆవిష్కరణల రంగంలో కృషి చేయ‌నుంది. అమెరికాలోని మిన్నెసోటాలో దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఉంటుంది. ఈ సంస్థ‌‌ 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

వాటిల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ఆయా దేశాల్లో కేంద్రాలు లేవు. అమెరికా తర్వాత హైద‌రాబాద్‌లోనే రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2016లో అమెరికాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించి మెడ్‌ట్రానిక్‌ కార్యనిర్వాహక చైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. నాన‌క్ రాం గూడ‌లో త‌మ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని ఆ ప‌నుల‌ను పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement