Thursday, November 21, 2024

మెడిసిన్స్​ క్రమం తప్పకుండా వాడాల్సిందే.. అసంక్రమిత వ్యాధిగ్రస్థులకు డాక్టర్ల స్పష్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీపీ, షుగర్‌, కిడ్నీ, హార్ట్‌, హెచ్‌ఐవీ, ట్యూబర్‌క్యులోసిస్‌ (టీబీ) తదితర అసంక్రమిత (ఎన్‌సీడీ) వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులను వాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో మానకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజూ వాడుతున్న బీపీ, షుగర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధి నియంత్రణ ఔషధాలను మధ్యలో కొన్ని రోజులపాటు మానేస్తే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యం విషమించిన స్థితిలో ఆసుపత్రులకు వస్తున్న బీపీ, షుగర్‌, గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. పరీక్షించగా వారిలో 90శాతం మంది ఎన్‌సీడీ మందులను మధ్యలో కొన్ని రోజులపాటు మానేశారని, దాంతో ఆరోగ్యం విషమించినట్లుగా వైద్యులు గుర్తిస్తున్నారు. క్రమం తప్పకుండా బీపీ, షుగర్‌ మందులను వాడుతూ మధ్యలో ఆపేయడం మూలాన పేషెంట్ల కంటి చూపు, కిడ్నీ, ఇతర ముఖ్య అవయవాల పనితీరు దెబ్బతిని అంతిమంగా బ్రెయిన్‌డెడ్‌, హార్ట్‌ అటాక్‌ వంటి ప్రాణాలకే ముప్పు తెచ్చే సమస్యలకు దారితీస్తోంది.

ఈ పరిస్థితుల్లో బీపీ, షుగర్‌, కిడ్నీ, హార్ట్‌, హెచ్‌ఐవీ, ట్యూబర్‌క్యులోసిస్‌ తదితర అసంక్రమిత వ్యాధిగ్రస్థులు క్రమం తప్పకుండా మందులను ప్రతి రోజూ వినియోగించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మందులను మధ్యలో మానేస్తే ఆరోగ్యం విషమించిన తర్వాత చికిత్స చేయడం లేదా శస్త్ర చికిత్సలు చేయడం చాలా కష్టంగా మారుతోందని చెబుతున్నారు. ఎన్‌సీడీ వ్యాధిగ్రస్థుల్లో ఒక్కసారి ఆరోగ్యం విషమిస్తే చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో రోగులతోపాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఒకటి రెండు రోజులపాటు ఎన్‌సీడీ మందులను ఆపేస్తే వచ్చే సమస్యలు పెద్దగా ఉండటం లేదని, కాని వారం, పది రోజులకు మించి బీపీ, డయాబెటిక్‌ మందుల వినియోగాన్ని మానేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా షుగర్‌ పేషెంట్లు భోజనానికి ముందు భోజనానికి తర్వాత తమ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను టెస్టును చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్‌ స్థాయిలను పరీక్షించుకుంటుండటంతో వారి షుగర్‌ స్థాయిలను సరిగ్గా అంచనా వేయడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ ఎన్‌సీడీ టెస్టు చేయించుకోవాలి : డా. కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి, నిజామాబాద్‌ వైద్య కళాశాల. చాలా మంది బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి కారణం వారు ఎన్‌సీడీ మందులను క్రమం తప్పకుండా తీసుకోకపోవడమే. బీపీ, షుగర్‌ ఉఎందని తెలిసినా జీవనశైలిలో మార్పులను అలవర్చుకోకుండా ఆధునిక జీవనశైలినే కొనసాగించడం ప్రమాదకరం. చాలా మందికి తమకు బీపీ, షుగర్‌ ఉన్నట్లు తెలియదు. దీంతో ఒక్కసారిగా ఆరోగ్యం విషమించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. యుక్త వయసులో గుండె పోటు మరణాలు పెరిగేందుకు ఈ పరిణామం కారణమవుతోంది. ఈనేపథ్యంలో 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ కచ్చితంగా బీపీ, షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement