Friday, November 22, 2024

Medical State – వైద్యారోగ్య రంగంలో విప్ల‌వం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం దేశంలోనే అగ్రగామిగా వెలుగొందు తున్నది. సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్లుగా వైద్యరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంతో బలోపేతం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. స్వరాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. తొమ్మిదేళ్లలో హెల్త్‌ బడ్జెట్‌ రెండున్నర రెట్లు పెరిగింది. తలసరి వైద్య బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలచింది. ఈ ఏడాది తలసరి కేటాయింపులు రూ.3,225గా నమోదు కాగా, తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి కేటాయింపులు కేవలం రూ.925 మాత్రమే. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉండగా, రాష్ట్రం నుంచి వైద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్లేవారు. ఈ పరిస్థితులను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ ప్రతీ జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా రాష్ట్రంలో కొత్తగా 21 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిపారు.

రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులైన గాంధీ,ఉస్మానియా, నిమ్స్‌ దవాఖానాలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్‌ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈమేరకు జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తూనే హైదరాబాద్‌ నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. కొరోనా సమయంలో గచ్చిబౌలి టిమ్స్‌ ఏర్పాటు కాగా, కొత్తగా అల్వాల్‌, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

నిమ్స్‌, గాంధీలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, గాంధీలో ఎంసిహెచ్‌ పనులు చివరి దశకు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే కొత్తగా 10,000 సూపర్‌ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. గర్బిణిలకు ప్రయాణ వేళ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ దేశంలోనే తొలిసారిగా అమ్మ ఒడి వాహనాలను ప్రవేశపెట్టారు. ఏఎన్సీ చెకప్‌ల సమయంలో ప్రసవం సమయంలో డిశ్చార్జి సమయంలో ఇంటి నుంచి దవాఖానకు, దవాఖాన నుంచ ఇంటికి ఉచితంగా రవాణా చేయగలుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా రోగాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా ఎన్సీడీ స్క్రీనింగ్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ దవాఖానాల్లోని పరికరాలు నిరంతరాయంగా పని చేసేందుకు ప్రత్యేకంగా ఎక్విప్‌మెంట్‌ ప్రోగ్రాం అమలవుతోంది. పిహెచ్‌సిల్లో పనితీరును మెరుగుపరిచేందుకు లైవ్‌ సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య మహిళ పేరుతో వైద్యారోగ్య శాఖ రూపొందించిన ఈ ప్రత్యేక కార్యక్రమం మహిళా దినోత్సవం రోజున ప్రారంభమైంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్‌ చేసుకోవాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే పిహెచ్‌సిలు, సబ్‌సెంటర్లను సైతం ప్రభుత్వం బలోపేతం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement