Tuesday, November 26, 2024

Big story | జట్టు కట్టు.. లాభాలు పట్టు! మెడికల్‌ మాఫియా నయా దోపిడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అత్యవసర రంగమైన మెడికల్‌ కేర్‌ను దోపిడీ వ్యవస్థగా మార్చేస్తున్నాయి ఫార్మా కంపెనీలు. డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలతో అడ్డదారిలో రోగులను దోచుకునేందుకు వ్యూహాలు రచిస్తూ అదుపుతప్పిన సంపాదనను లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. ‘జట్టు కట్టు.. లాభాలు పట్టు’ అన్న చందంగా మెడికల్‌ మాఫియా యధేచ్చగా కొత్త తరహా దోపిడీని పాల్పడుతోంది. ఫార్మా కంపెనీలు, రిటైల్‌ చైన్‌ షాపులు, డాక్టర్లతో ఒప్పందాలు.. ఇలా అన్నీ ఒకదానికొకటి ముడిపెట్టుకుని ఉండడంతో అడ్డదారి దోపిడీలో అందరూ భాగస్వాములవుతున్నారు.

అత్యవసర మందుల ధరలు అడ్డగోలుగా పెంచేస్తూ దండుకుంటున్నారు. అదే సమయంలో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. చీకటి ఒప్పందాల క్రమంలో సమాజం దేవుళ్ళకు ప్రతిరూపంగా భావించే డాక్టర్లు సైతం అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకే రోగులకు మెడిసిన్‌ ప్రిస్క్రిప్షన్‌ రాస్తూ ఒక్కో వైద్యుడు నెలనెలా లక్షల్లో సంపాదిస్తున్నారు.

- Advertisement -

ఏ కంపెనీలతో ఒప్పందం కుదురుతుందో.. ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఖరీదైన మందులనే డాక్టర్లు ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు నిర్వహిస్తున్న తమ ఔట్లెట్లలో ఆ మందులకు మాత్రమే డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. డిస్కౌంట్‌ కావాలంటే.. అంతకు ముందుగా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని రోగులకు మాయమాటలు చెబుతూ, మరో రూపంలో కూడా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యాపారం ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’ అన్నట్లుగా విస్తరించి కంపెనీల ఖాతాలకు వందల కోట్లు వెళుతున్నాయి.

ఇది దేశవ్యాప్తంగా పీడిస్తున్న సమస్యే.. కానీ రాష్ట్రమంతటా సిందికేట్‌ మెడికల్‌ మాఫియా అమాయక ప్రజలే లక్ష్యంగా నిలువు దోపిడీకి పాల్పడుతోంది. నేటి సమాజంలో కల్తీ ఆహార పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబంలోనూ మందుల వినియోగం దాదాపు నిత్యావసరంగా మారిపోతోంది. ఈ క్రమంలో మందుల విక్రయ సంస్థల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. భారీ డిస్కౌంట్ల పేరుతో ఎర వేసి మందుల వ్యాపారాన్ని ఆయా సంస్థలు విస్తరింపజేసుకుంటున్నాయి. వందలు, వేల సంఖ్యలో రిటైల్‌ ఔట్‌లెట్లను కలిగివున్న అనేక హెల్త్‌ కేర్‌ సంస్థలు, ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు ప్రతి నిత్యం ఇదే పనిగా మోసపూరిత వ్యాపారాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.

పేరుగాంచిన ఫార్మా కంపెనీలు సైతం పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేక, గత్యంతరం లేక రిటైల్‌ సంస్థలను ఆశ్రయిస్తూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. భేరసారాలకు ఏమాత్రం అవకాశం లేని మందుల విక్రయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి నిఘా లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా మందులు కొనుగోలు చేయాల్సి రావడం.. చీకటి ఒప్పందాలకు, అక్రమా వ్యాపారాల విస్తరణకు పరోక్షంగా దోహదపడుతున్నాయి. నిఘా వైఫల్యాన్ని అదునుగా చేసుకుంటూ నిత్యం వేల కోట్ల రూపాయల వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. రోగుల అవసరాలను, ఆతృతను అదునుగా భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్న రిటైల్‌ కంపెనీల అధీకృత ఔట్‌లెట్లు పెద్దమొత్తంలో దొడ్డిదారి ఒప్పంద వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ఈ అక్రమ దందాలో మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. రిటైల్‌ సంస్థలకు, ఫార్మా కంపెనీలకు మధ్యవర్తిగా ఉంటూ భారీ డిస్కౌంట్ల పేరుతో దోచుకునేందుకు పక్కా ప్రణాళికతో మార్కెటింగ్‌ చేస్తున్నాయి. డిస్కౌంట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై, అల్లోపతి మెడిసిన్‌ విచ్చలవిడి అమ్మకాలపై ఔషధ నియంత్ర అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు తనిఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే మెడికల్‌ షాపుల్లో మందులు ఇవ్వాలి. ఈ నిబంధనలను చాలా మంది దుకాణదారులు పాటించడం లేదు.

జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపునొప్పి గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్‌ షాపుల్లో అడగ్గానే మందులిచ్చేస్తున్నారు. చట్ట ప్రకారం కార్డియాలజీ, సైక్రియాట్రిక్‌, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, డయాబెటిక్‌, బీపీ, థైరాయిడ్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ తదితర సమస్యలకు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హై డోస్‌లో అనేక రకాలుంటాయి. వ్యాధి తీవ్రత, రోగి వయసు, శరీర తత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్‌ను నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్‌ షాపునకు వెళ్లి అడిగితే ఏ రోగానికైనా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు.

మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గుకు వాడే సిర్‌పలు తాగుతున్నారు. కోరెక్స్‌, పెన్సిడ్రిల్‌ వంటి ఔషధాలు కొంత మత్తును కలిగిస్తాయి. ఆల్కహాల్‌, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొరకని సమయాల్లో మెడికల్‌ సిర్‌పలు వాడుతున్నారు. ఈ తరహా సిరప్‌లను డాక్టర్‌ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్‌ షాపుల్లో ఎవరెన్ని, ఏ మందులు అడిగినా ఇచ్చేస్తున్నారు. డ్రగ్స్‌, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. డాక్టర్‌ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులను అంటగడుతున్నారు.

మందుల దుకాణాల్లో డాక్టర్లకు ఇచ్చే షాంపిల్‌ మెడిసిన్‌, జనరిక్‌ మందులను కూడా ఎక్కువ ధరలకు యథేచ్చగా విక్రయిస్తూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. శాంపిల్స్‌ జనరిక్‌ మందులు వైద్యులకు, మెడికల్‌ షాపుల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్క అక్షరం తేడాతో ఉండే అదే రకం డ్రగ్స్‌ను విక్రయిస్తూ దోచుకుంటున్నారు. ఖరీదైన బ్రాండ్ల పేరు చెబుతూ, ప్రజల కోసం కేంద్రం నుంచి తక్కువ ధరకు వస్తున్న జనరిక్‌ మందులు ఇస్తున్నారు. వీటి పనితీరులో పెద్ద తేడా లేకున్నా.. వసూలు చేస్తున్న తీరులో మాత్రం నాలుగైదు రెట్ల తేడా ఉంటుంది. పదుల రూపాయలలో కావాల్సిన బిల్లులు రూ.వందలకు పెంచి దోపిడీ చేస్తున్నారు. వైద్య పరిజ్ఞానం ఏమాత్రం లేనివారి జేబులు గుల్ల చేస్తున్నారు.

డాక్టర్ల భాగస్వామ్యం కీలకం.. తాయిలాలకు కక్కుర్తి

రాష్ట్రమే కాదు.. దేశం మొత్తం ఎక్కడ చూసినా మెడికల్‌ మాఫియాలో డాక్టర్ల భాగస్వామ్యం అత్యంత కీలకంగా ఉంటోంది. వివిధ మందుల కంపెనీల ప్రతినిధులు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తి పడి రోగులకు అవసరం లేకున్నా ఆయా మందులను అంటగడుగుతున్నారు. ఒకటి రెండు రకాల మందులతో నయం అయ్యే రోగానికి కూడా ఐదారు రకాల కంపెనీల మందులను రాసి కమీషన్ల రూపంలో వైద్యులు తమ జేబులు నింపుకుంటూ ప్రజలను ముంచుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో వైద్యుని దగ్గరకు వెళ్తే సుమారు… 1000 విలువ చేసే యాంటిబయాటిక్స్‌ టాబ్లెట్స్‌, ఇతర టానిక్‌లు తదితర మందులను అంటగడుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫార్మా రంగానికి హైదరాబాద్‌ ప్రధాన అడ్డా?

జాతీయ స్థాయిలో ఫార్మా రంగానికి హైదరాబాద్‌ మహానగరం ప్రధాన అడ్డాగా మారుతోంది. కోవిడ్‌ మందుల తయారీ మొదలుకుని విదేశాలకు ఎగుమతి చేసే మందుల వరకు ఇక్కడ పెద్దమొత్తంలో తయారు అవుతుండడంతో ఉత్పత్తి కంపెనీలు, రిటైల్‌ సంస్థలన్నీ తమ దోపిడీ దుకాణాలను ఇక్కడి నుంచే మొదలు పెట్టాయి. ఇంటర్నేషనల్‌ ఫార్మా ఎగ్జిబిషన్‌ 9వ ఎడిషన్‌ హైదరాబాద్‌లోని హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. కామర్స్‌ మినిస్ట్రీ సపోర్ట్‌తో ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.

ప్రపంచంలోని 200 దేశాలకు మన ఫార్మా కంపెనీల ప్రొడక్ట్‌లు ఇక్కడ ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. గత ఏడాది 25.39 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగిట్లు ఫార్మా రంగం నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది 28.99 బిలియన్‌ డాలర్ల లక్ష్యానికి చేరుకునే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్‌లు, ఆయుష్‌, హెర్బల్స్‌, సర్జికల్‌ ఎగుమతులన్నీ హైదరాబాద్‌ నుంచే జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement