Saturday, November 23, 2024

మెడికల్ మాఫియా డీలింగ్.. పర్సంటేజీలకు కొంతమంది డాక్టర్ల ఇంపార్టెన్స్

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: సాధారణ మాత్ర, టానిక్‌తో తగ్గే రోగానికి కూడా ప్రస్తుతం చాలా మంది వైద్యులు ఖరీదైన ఔషధాలను రెఫర్‌ చేస్తున్నారు. మెడికల్‌ ఫార్మకంపెనీల మాయలో పడి రోగులను నిలువునా దోచుకుంటున్నారు. ఏ ఫార్మాకంపెనీ ఎక్కువ పర్సంటేజీ ఇస్తే ఆ కంపెనీ మందులనే ప్రిస్కిప్షన్‌ రూపంలో ఇస్తున్నారు వైద్యులు. ఔషధ తయారీ కంపెనీలు ఇచ్చే గిప్ట్‌లు, ప్యాకేజీలకు ఆశపడి రోగం నయమవుతుందని ఎంతో నమ్మకంతో వచ్చిన రోగులకు శఠగోపం పెడుతున్నారు. మెడికల్‌ కంపెనీలు చెప్పిన మందులనే రోగులకు అంటగడుతున్నారు. ఈ అక్రమ దందాను నియంత్రించాల్సిన రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో అవసరం లేని ఆరు ఔషధాల విక్రయాలుగా నడుస్తోంది.

వైద్యుల తీరు ఇలా ఉంటే… ఇక మెడికల్‌ షాపుల దోపీడీ మరోలా ఉంది. రోగం నయం కావడానికి వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ పట్టుకెళితే అందులో ఏముందో చదవడానికి కూడా రాని భాషలో రాస్తున్నారు. కొందరికి మొదటి అక్షరం తప్ప దాంట్లో ఇంకేమీ అర్థం కాదు. దీంతో బ్రాండెడ్‌ పేరిట నాసిరకం మందులను రోగులకు అంటగడుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రస్తుతం ధనార్జనే ధ్యేయంగా మెడికల్‌ షాపులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. బీఫార్మసీ, డీఫార్మసీ ఉత్తీర్ణులైన వారే మెడికల్‌ షాపులను పెట్టాల్సి ఉన్నా… రాష్ట్రంలో మెజారిటీ మెడికల్‌ షాపులు ఇందుకు విరుద్ధంగా నడుస్తున్నాయి.

అనుమతులు ఒకరి పేరుపై తీసుకుని మరొకరు మెడికల్‌ షాపును నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఇంత అని నిర్వాహకులు ఫార్మసీ సర్టిఫికెట్‌ ఇచ్చిన వ్యక్తికి ముట్టచెబుతున్నారు. అనర్హులు మెడికల్‌ షాపులను నిర్వహిస్తుండడంతో ఒక మందుకు బదులు మరో మందు ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. వైద్యుడి ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వొద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా మెడికల్‌ షాపులు బేఖాతరు చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement