ప్రభన్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆయా కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన డిజైనింగ్ ఏజెన్సీలు, అధికారులతో సమీక్ష జరిపారు. ఎనిమిది నూతన కాలేజీల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేస్తే మారుమూల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యసేవలు అందుతాయన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
స్థలం వృధా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. వైద్యాధికారులు, ఇంజనీరింగ్ విభాగం, ఎన్‌ఎంసీ నిబంధల మేరకు మరోసారి మంగళవారం సమీక్షించుకుని పూర్తిస్థాయి నమూనాలను, అంచనాలను రూపొందించాలని చెప్పారు. ఆధునిక పద్ధతుల్లో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా రూపొందించాలన్నారు. నిర్మాణాల విషయంలో రాజీపడవద్దని సూచించారు. అన్ని కళాశాలల నమూనాలను వీక్షించారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు టిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. గచ్చిబౌలి, సతన్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయన్నారు. ఢిల్లిలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. ఒక్కోటి వెయ్యి పడకలతో ఈ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital