Saturday, November 23, 2024

జిల్లాకో వైద్య కళాశాల, భారీగా ఎంబీబీఎస్‌ సీట్లు.. కేంద్రం సహకరించకున్నా పురోగమిస్తున్నాం: హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మన విద్యార్థులు ఉక్రెయిన్‌, చైనా, ఫిలిపిన్‌ తదితర దేశాలకు పోయి వైద్య విద్య అభ్యసించే పరిస్థితి రాకుండా ఉండేందుకే రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్యను భారీగా పెంచామని మంత్రి #హరీశ్‌రావు తెలిపారు. సోమవారం అసెంబ్లిd ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కోరుకంటి చందర్‌, మర్రి జనార్ధన్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, గాదరి కిషోర్‌ కుమార్‌, హరిప్రియ నాయక్‌ తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినా వైద్య కళాశాలల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం దేశ వ్యాప్తంగా 171 వైద్య కళాశాలలను మంజూరు చేయగా అందులో ఒక్కటి కూడా తెలంగాణను ఇవ్వలేదన్నారు. ఒక్కో కళాశాలకు కేంద్రం రూ. 200 కోట్ల వరకు గ్రాంట్‌ ఇస్తుందని, ఒక్క కళాశాలను ఇచ్చినా రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా ఉండేదన్నారు. ప్రతిపాదనలను పంపించినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ రాష్ట్రంలో వైద్యకళాశాలలు 3 నుంచి 33 కి పెరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది 2,850 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ చేస్తున్నామని, వైద్య కళాశాలలలో విద్యార్థుల బోధన కోసం మృతదేహాల లభ్యత చాలా అవసరం. గుర్తించామని, ఇందుకు చట్ట సవరణ కూడా చేయాల్సి ఉందన్నారు.

జూన్‌ నుంచి రాష్ట్రంలోని నాలుగు కళాశాలల్లో బోధన ప్రారంభం కానుందన్నారు. త్వరలోనే ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్నారు. పీజీ సీట్ల సంఖ్యను 531 నుంచి 938కి పెంచామని, సూపర్‌ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను 82 నుంచి 153కు పెంచడం జరిగిందన్నారు. రానున్న నాలుగేళ్ళలో రాష్ట్రంలో మరిన్ని ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు పీజీ సీట్లు, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో పేద ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రకటించారు. సోమవారం శాసనసభలో సభ్యులు కేపీ వివేకానంద, బిగాల గణేష్‌, ఆరూరి రమేష్‌, కోరుకంటి చందర్‌, జాఫరుస్సేన్‌ తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికే 259 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మరో 91 దవాఖానాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా టెలీమెడిసిన్‌ను కూడా అందిస్తున్నామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఇప్పటికే హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని చేపట్టామని, కంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించామన్నారు. రానున్న కాలంలో అవసరమైన అన్ని చోట్ల బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement