Friday, November 22, 2024

Delhi | టమాట ధరల పెరుగుదలకు అనేక కారణాలు.. ధరల స్థిరీకరణకు చర్యలు : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా పెరిగిపోయిన టమాట ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోమవారం లోక్‌సభలో ఎంపీ డా. కళానిధి వీరస్వామి అడటిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ.. టమాటా ధరల పెరుగుదలకు ఏకకాలంలో పలు కారణాలు దోహదపడ్డాయని తెలిపారు. పంట సీజన్ మార్పు, కర్ణాటక కోలార్ జిల్లాలో పంటకు ‘వైట్ ఫ్లై’ తెగులు, ఉత్తర భారతదేశంలో ఒక్కసారిగా రుతుపవనాలు ప్రవేశించడం, భారీ వర్షాల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు దెబ్బతినడం వంటి పరిస్థితులు టమాట ధరల పెరుగుదలకు కారణమయ్యాయని వెల్లడించారు.

దేశీయంగా ఉత్పత్తి తగినంత లేకపోవడంతో కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నామని, ఈ కారణంగా దాని ధర పెరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలైన ఎరువులు, పురుగు మందుల విషయంలో హోల్‌సేల్ ధరల సూచి, ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే తక్కువగానే ఉన్నాయని అన్నారు. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించే క్రమంలో ప్రభుత్వం ఉల్లి, పప్పుదినుసులను బఫర్ స్టాక్ నుంచి విడుదల చేస్తున్నామని నిర్మల సీతారామన్ తెలిపారు.

ధరల స్థిరీకరణ నిధి నుంచి బఫర్ స్టాక్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ట్రేడర్లకు స్టాక్ నిల్వ పరిమితి విధించడం, అక్రమ నిల్వలకు ఆస్కారం లేకుండా నిఘా పెట్టడం, అవసరానికి తగ్గట్టు ఎగుమతి, దిగుమతి పాలసీలను మార్చడం వంటి చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. నిరుపేదలకు ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద ఉచితంగా ఆహార పదార్థాల పంపిణీ జరుగుతోందని, తద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. అలాగే ‘భారత్ దాల్’ పేరుతో సబ్సిడీపై శనగ పప్పును ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని కూడా ఆమె వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement