అమరావతి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా బొగ్గు కొరతను అధిగమించేందుకు పది శాతం విదేశీబొగ్గు కొనుగోళ్ళు చేయాలన్న కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు- రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత అక్టోబర్ నుంచి దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ప్రారంభమైందని, దానిని పరిష్కరించేందుకు కేంద్ర బొగ్గు, రైల్వే, విద్యుత్ శాఖ మంత్రుల కోర్ కమిటీ- ప్రతివారం సమావేశమవుతూ పలు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దీనిలో భాగంగా విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గులో పదిశాతంను విదేశాల నుంచి రాష్ట్రాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తీసుకువచ్చారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని బొగ్గు డిమాండ్‌లో 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలకు ఉన్న మాదిరిగానే రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు కూడా రెండు, మూడు రోజులకు సరిపడా నిల్వలనే కలిగి ఉన్నాయని, కేంద్రం ద్వారా వస్తున్న బొగ్గును ఎప్పటికప్పుడు నిల్వ చేసుకుని వినియోగించుకుంటున్నామని తెలిపారు. కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలలను ఉంచుకోవాలని కేంద్ర నిర్ధేశం ఉన్నా, దానికి అనుగుణంగా డిమాండ్‌కు తగినట్లు కోల్ ఇండియా నుంచి ఉత్పత్తి పెరగడం లేదని, కేంద్రం నుంచి కూడా ఎక్కువ సరఫరా జరగడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్ధేశించిన మేరకు విదేశీ బొగ్గు కొనుగోళ్ళు చేపట్టడం ద్వారా బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
సెప్టెంబరు వరకూ డిమాండ్ మేరకు సరఫరా..
విద్యుత్ శాఖ అధికారుల అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు డిమాండ్ మేరకు విద్యుత్ ను అందించగలమని, అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఖరీఫ్ పంటలు, ఇతర కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించడం, రాష్ట్రంలో విద్యుత్ జనరేట్ చేసే సంస్థల నుంచి రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కేటాయింపులను పొందడం, కృష్ణపట్నం మూడో యూనిట్‌ను వినియోగం లోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో జెఎండి ఐ. పృథ్వితేజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ (గ్రిడ్ ట్రాన్స్ మిషన్ మేనేజ్ మెంట్) కె.ముత్తుపాండ్యన్, డిస్కమ్ సిఎండిలు హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్ధన రెడ్డి, కే.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..