Tuesday, November 26, 2024

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు.. గ్రామాల్లో తాగునీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే గ్రామాల్లో నీటిని పొదుపుగా వాడుకోవడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న క్రమంలో రిజర్వాయర్లలోని నీటిమట్టం, గ్రామాల్లో నీటి సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పడు అధికారులు తెలుసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో మోటర్లు, పంపులు, పైపుల లీకేజీలను అరికట్టడం వంటి మరమ్మత్తుల అంశాల్లో కిందిస్థాయి సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పథకానికి దేశంలోనే మంచిపేరు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన్న ఈ పథకం అమలుతో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింది. మారుమూల పలెల్లకు గిరిజన తండాలకు, ఆదివాసీ గూడెంలకు మిషన్‌ భగీరథ మంచినీరు అందుతుంది. 2014కు ముందు కేవలం 5,672 అవాసాలకు మాత్రమే పాక్షికంగా తాగునీరు అందేది.

నేడు రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రతి రోజూ సురక్షితమైన నీరు సరఫరా చేస్తున్నారు. మొత్తం 57,26,804 ఆవాసాలకు నల్ల కనెక్షన్లు ఉన్నాయి. 65 ఇన్‌టేక్‌ బావులు, 109 వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, 1,49,905 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌,13,901 సర్వీస్‌ క్రాసింగ్‌లు మిషన్‌ భగీరథ పథకంలో భాగమై ఉన్నాయి. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు వేదికలు, స్మశాన వాటికలకు 87,412 కనెక్షన్లు ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మిషన్‌ భగీరథకు రూ.5305 కోట్ల కేటాయించారు. వాటిలో తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు కింద వివిధ సెగ్మెంట్ల నిర్వహణ, అంతర్గత గ్రామ పనుల కోసం 480 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement