Thursday, November 7, 2024

TGSPDCL | సమ్మర్‌ డిమాండ్‌ను తట్టుకునేలా చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న వేసవిలో ఏర్పడే అధిక విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేలా పంపిణీ, ట్రాన్స్‌ మిషన్‌ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ అధికారులకు సూచించారు. గురువారం, మింట్‌ కాంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ట్రాన్స్‌కో డైరెక్టర్‌ జగత్‌ రెడ్డి, ఇతర ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో వేసవి కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంచనా వేశారు. గతేడాది 3756 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్‌ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4352 మెగావాట్లుగా నమోదయ్యింది, గతేడాది 81.39 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న వినియోగం దాదాపు 12 శాతం వృద్ధితో 90.68 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

రాబోయే 2025 వేసవిలో సైతం విద్యుత్‌ డిమాండ్‌ గతం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సుమారు 20 – 25 శాతంగా వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన నెమలి నగర్‌, గోపన్‌ పల్లి, కోకాపేట్‌, కోహెడ, తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్‌ మెట్‌, మాన్సాన్‌ పల్లి, అజిజ్‌నగర్‌, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్‌, వాయుపురి, ఉప్పల్‌ భాగాయత్‌, దుండిగల్‌ వంటి ప్రాంతాల్లో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతున్నది.

ఆ ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టు 220/32/3 కేవీ సబ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు, ఇతర నెట్వర్క్‌లను పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎండీ దిశానిర్దేశం తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న నిర్వహణ మరమ్మతు పనులను నాణ్యత ప్రాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలన్నారు.

నిర్వహణ పనుల కోసం తీసుకుంటున్న లైన్‌ క్లియరెన్స్‌ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్‌సీ లు తీసుకునేటప్పుడు ట్రాన్స్‌కో, డిస్కం ఇంజినీర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. సంక్రాంతి లోపుగా 100 శాతం నిర్వహణ పనులు పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement