Friday, November 22, 2024

కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన మేయర్, మరో ఇద్దరు కార్పొరేటర్లు.. రాహుల్ నివాసంలో పార్టీ తీర్థం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బడంగ్‌పేట్ మున్పిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహా రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస రెడ్డి సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాసంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్ హాజరయ్యారు. పార్టీలో చేరినవారిని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సాదరంగా ఆహ్వానించడంతోపాటు రాహుల్ గాంధీకి వారిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన నేతలతో రాహుల్ గాంధీ గ్రూప్ ఫొటో దిగారు.

తెరపైనే కుస్తీ, తెర వెనుక దోస్తీ.. బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి కామెంట్స్​..

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అవినీతి సొమ్ముతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో హంగామా సృష్టించాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కిరాయి మనుషులను ఔట్‌సోర్సింగ్ చేసి బలప్రదర్శన చేశారని మండిపడ్డారు. తెలంగాణలో రోజుకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, నిరుద్యోగులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ఇలాంటి ప్రదర్శనలు చేపట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. చిల్లర మాటలతో, చివరకు ఫ్లెక్సీల విషయంలో కూడా బీజేపీ-టీఆర్ఎస్ పరస్పరం తిట్టుకున్నారు తప్పితే, సమస్యల గురించి ఒకరినొకరు విమర్శించుకోలేదని గుర్తుచేశారు. దేశంలో మతసామరస్యం దెబ్బతింటోందని, ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తోందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజా సమస్యల పరిష్కారమే జరగడం లేదని ఆరోపించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే పరిస్థితే లేదని, సొంత పార్టీ నేతలకే మర్యాదలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి ఉన్నందుకే స్థానిక సంస్థల నేతలు టీఆర్ఎస్ వీడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన మేయర్, కార్పొరేటర్లను రాహుల్ గాంధీ అభినందించారని రేవంత్ తెలిపారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన ప్రకటించారు.

భవిష్యత్తుల్లో మరిన్ని చేరికలు: భట్టి

కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ నివాసంలో చేరికల కార్యక్రమం అనంతరం బయటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో చేరిన రెండున్నరేళ్ల తర్వాత వాస్తవం గ్రహించారని, అందుకే కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చారని తెలిపారు. కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, టీఆర్ఎస్ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించి చెప్పాలని పార్టీలోకి తిరిగొచ్చిన నేతలను భట్టి విక్రమార్క కోరారు.

- Advertisement -

అధికార పార్టీతో ఉన్నా.. ఏమీ చేయలేకున్నాం : మేయర్ పారిజాత..

కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ, అనంతరం టీఆర్ఎస్ తరఫు మేయర్ పదవిని పొందిన పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీలో కనీసం నోరుమెదపడానికి కూడా వీల్లేకుండా పోయిందని వాపోయారు. ఎంతో మంది బడంగ్‌పేట్ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తనను సంప్రదిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏ సమస్యనూ పరిష్కరించడం లేదని పారిజాత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే తాము సొంతగూటికి తిరిగొచ్చామని చెప్పారు. కనీసం చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వేర్వేరు హోదాల్లో సేవలు అందించామని, ఇకపై సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో తిరిగి సేవలందిస్తామని ఆమె అన్నారు. తన నిర్ణయాన్ని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు సమర్థిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement