హైదరాబాద్ లోని పలు హోటళ్లలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటళ్లలో ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. మొగల్ రెస్టారెంట్‌ను పరిశీలించిన మేయర్.. ఆహార పదార్థాలు, తయారీని పరిశీలించారు.
వంటగది అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణాలు పాటించకుండా మాంసాన్ని నిల్వ ఉంచడంతో యజమానిని మందలించారు. నిల్వ ఉంచిన మాంసం నమూనాలను ఆహార భద్రత అధికారులు సేకరించారు. నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు.
కాగా, నగరంలో పలు హోటళ్లలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని… కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్‌లను సైతం ఆహార పదార్ధాల తయారీలో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
దసరా రెస్టారెంట్‌లో కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే హోటల్, రెస్టారెంట్ యజమానులకు నోటీసులు సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేశారు.