ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్‌లో మరోసారి ఫైనల్ చేరకుండానే ఆర్సీబీ జట్టు ఇంటికెళ్లిపోయింది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చివరి వరకూ ఆ టీమ్ పోరాడినా.. ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ ఓడిపోవడంతో కొందరు ఆర్సీబీ అభిమానులు ప్లేయర్స్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు చేసి.. 1.4 ఓవర్లలోనే 29 పరుగులు ఇచ్చిన ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ గర్ల్ ఫ్రెండ్‌ను కూడా లక్ష్యంగా చేసుకొని ఫ్యాన్స్ అసభ్య కామెంట్స్ చేశారు. దీనిపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ చాలా ఘాటుగా స్పందించాడు.
ఆర్సీబీకి ఇది మంచి సీజనే. కాకపోతే మేము అనుకున్నది సాధించలేకపోయాం. అయితే సోషల్ మీడియాలో కొంత చెత్త పారుతుండటం చూస్తుంటే అసహ్యమేస్తోంది. మేము మనుషులం. ప్రతి రోజూ మేము చేయగలిగినంత చేస్తాం. ఇలాంటి ద్వేషాన్ని వెదజల్లే కంటే మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి అని మ్యాక్స్ వెల్ ట్వీట్ చేశాడు. అదే సమయంలో మరో ట్వీట్‌లో నిజమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
దురదృష్టవశాత్తూ కొంతమంది భయానకమైన వ్యక్తులు సోషల్ మీడియాను ఓ భయానకమైన ప్రదేశంగా మారుస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మీరు వాళ్లలాగా ఉండొద్దు అని మరో ట్వీట్‌లో మ్యాక్స్ వెల్ అన్నాడు. మీరు నా టీమ్‌మేట్స్/ఫ్రెండ్స్ ను తిడితే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. ఇలాంటి వ్యక్తిగా ఉండి ఏం లాభం? ఇందులో ఎలాంటి సంజాయిషీ అవసరం లేదు అని మరో ట్వీట్‌లో మ్యాక్సీ అభిప్రాయపడ్డాడు.