Saturday, November 23, 2024

మన్యం కొండ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌.. రోప్‌ వే నిర్మాణం కోసం 50 కోట్ల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జీవవైవిద్యానికి,ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు అయిన నల్లమల లో ఆధ్యాత్మికతను వెదజల్లే ఆలయాలు, గోపురాలు అనేకం ఉన్నాయి. పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు వాటిపై అలుముకున్న పొగమంచులో సెలయోటి శబ్దాలు మంత్రముగ్దుల్ని చేస్తుండగా మన్యం కొండ పర్వత శిఖరంపై కొలువుతీరిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయాన్ని తెలంగాణను పాలించిన అనేక రాజవంశాలు, స్థానిక రాజులు కొంతమేరకు అభివృద్ధి చేసినప్పటికీ చిక్కని అడవిలో చక్కాగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలకోసం ప్రత్యేక నిధులు కేటాయించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రోప్‌ వే నిర్మాణంకోసం పనులు సర్వే నిర్వహించి పనులు ప్రారంభించింది. నాలుగు పర్వత శిఖరాలనుంచి ఆలయ పరిసరాలకు చేరుకునే విధంగా రోప్‌ వే నిర్మాణాన్ని తలపెటింది. ఈ పనులు పూర్తి అయితే ఇక్కడ టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.దశలవారిగా మన్యం కొండ అభివృద్ధి కి ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది.

- Advertisement -

మహబూబ్‌ నగర్‌ పట్టణానికి సమీపంలోని నల్లమల అడవిప్రాంతంలో ని కోటకదిరి గ్రామపరిధిలో కోలువుతీరిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తరతరాల చరిత్ర ఉంది. మన్యంకొండ లో మునులు తపస్సులు చేసుకున్నారనడానికి నేటికి ఉన్న గుహలు ఆధారాలుగా నిలిచాయి. శతాబ్దాల క్రితం మునులు ఇక్కడ తప్పస్సు చేసినట్లు స్థలపురాణం చెపుతుంది. మునులు తపస్సు చేసే ప్రాంతం కాబట్టి మనులకొండ ఆతర్వాత మన్యంకొండగా పేరు వచ్చింది. ఇది స్వయం భూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. పెన్నానదీ, కృష్ణా నదుల మధ్య విస్తరించిన అడవుల్లో కొలువుతీరిన శ్రీలక్ష్మీ సహిత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆయంలో స్వామివారిని దర్శించుకుంటే తిరుపతిలో వెంకటేశ్వరున్ని దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందనేది భక్తుల నమ్మకం. ప్రస్తుతం అనేక మూలమలుపులతో ఉన్న ఘాట్‌ రోడ్డుతో ఆలయానికి చేరుకోవచ్చు.అయితే తమప్రత్యేక ఆచారాలతో గిరిజనులు ముడుపులు చెల్లించుకుని జాతరచేయడం ఆనవాయితీగా మారింది. మన్యం కొండ జాతర అంటే నల్లమల అడవుల్లో

ప్రసిద్ధి. ఈ జాతరకరు అడవిప్రాంతాల్లోని ఆదివాసీలు, సుదూర ప్రాంతాలనుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ కొనేరు సహజసిద్ధంగా ఏర్పడింది. ఇప్పటికీ స్వచ్ఛమైన జలాలు ఈ కోనేటీ లో ఉన్నయి. ఔషధ గుణాలున్న కోనేటిలో స్నానం ఆచరిస్తే ఆరోగ్య సమస్యలుండవనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి ప్రత్యేకతలు శిల్పులు చెక్కని విగ్రహం, తవ్వని కోనేరు, దేవుని పాదాలు.బ్రహ్మోత్సవాల్లో ఘాట్‌ రోడ్‌ లో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే మిగతా రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రోప్‌ నిర్మించి ప్రయాణ సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆలయ విశిష్టతను తొలిసారిగా వాగ్గేయ కారుడు హనుమద్దాసు ప్రాచూర్యంలోకి తెచ్చారు. 1874 వరకు హనుమద్దాసు కీర్తనలతో వేంకటేశ్వరున్ని ఆరాధించారు. దక్షిణ తెలంగాణ అడవిప్రాంతం లోని మన్యంకొండ ఆలయ పునర్‌ నిర్మాణ పనులపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రస్తుతం మౌలికసదుపాయాల కల్పనకు అత్యంతప్రాధాన్య ఇస్తుంది. ఈ నేపథ్యంలో రూ. 50 కోట్ల రూపాయలు కేటాయించి రోప్‌ వే నిర్మాణ పనులకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement