Saturday, November 23, 2024

మన్యం కొండ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌.. 50 కోట్లతో డెవ‌ల‌ప్మెంట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దట్టమైన నల్లమల దండకారణ్యంలో ఆకాశాన్ని అందుకున్నట్లుండే కొండ శిఖరాల మధ్య కొలువై పేదల తిరుపతిగా భాసిల్లుతున్న మన్యంకొండ శ్రీవెంకటేశ్వర ఆలయాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఈ ఆలయానికి వేలాది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ పరిసరాల్లో జరిగిన పురావస్తు పరిశోధనల్లో సుమారు 5 వేల సంవత్సరాల క్రితం ప్రాచీన మానవుడు కొండగుహలను ఏర్పర్చుకుని సంఘజీవనం సాగించినట్లు చరిత్ర ఆధారాలు లభ్యమయ్యాయి.

నాటి నుంచి నేటి వరకు ఇక్కడ చారిత్రిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ 1814లో వాగ్గేయ కారుడు హనుమద్దాసు కీర్తనలతో మన్యంకొండ సుప్రసిద్ధి చెందింది. పేదల తిరుపతిగా భాసిల్లితున్న ఈ ఆలయానికి నల్లమల అడవుల్లోని తండాలు, గ్రామాల ప్రజలతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుని ప్రకృతి ఒడిలో సేద తీరడం ఆనవాయితీ అయింది. అయితే మన్యంకొండ ప్రయాణం దట్టమైన అడవులు, బండరాళ్ళ రహదారుల్లోంచి ఉండటంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి టెంపుల్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

కొండ కింద కొలువైన అలివేలు మంగ ఆలయం నుంచి కొండపైకి నిర్మిస్తున్న రోప్‌ వే పనులు చివరిదశలో ఉన్నాయి. రహదారులు, స్కై వేల నిర్మాణంలో పర్యాటక శాఖ నిమగ్నమైంది. సముద్రమట్టానికి 915 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయ పరిసరాల్లో స్కేవేలు, కేబుల్‌ కార్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రూ.100 కోట్లతో ప్రణాళికలు రూపొందించినప్పటికీ ప్రస్తుతం రూ.50 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులకోసం పరిసరాల్లో బడ్జెట్‌ హోటళ్లు, నిత్యాన్నదాన సత్రం, లడ్డు కేంద్రం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

- Advertisement -

మన్యంకొండ పరిసరాల్లోని కొండగుహల్లో రుషులు తపస్సు చేశారని స్థానికులు చెప్పుతున్నప్పటికీ ప్రాచీన మానవుడు ఈ ప్రాంతాల్లో గహలు ఏర్పర్చుకుని జీవించే వారని చరిత్ర కారుల అభిప్రాయం. అలాగే నల్లమల అడవుల్లోని లోయలు, కొండగుహల్లో కాకతీయుల కాలం నాటి సైనిక స్థావరాలు, ప్రతాపరుద్రుని కాలం నాటి కట్టడాలు అనేకం ఉన్నాయి. అయితే నల్లమల అడవులను కేంద్రంగా చేసుకుని గిజనులు పాలించిన చరిత్ర ఉన్నప్పటికీ మన్యం రాజులు ఈ ప్రాంతాన్ని పాలించడంతో మణికొండ కాలగమనంలో మన్యం కొండగా మారింది.

ఆధునిక చరిత్ర ఆనవాళ్ల మేరకు మన్యంకొండ శ్రీవెంకటేశ్వర దేవాలయాభివృద్ధి కోసం 1937లో నిజాంరాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 42 ఎకరాల స్థలం కేటాయించి భక్తుల సౌకర్యం కోసం రహదారుల నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిజాంల అనంతరం ఈ ఆలయ అభివృద్ధి కోసం గత సమైక్యపాలకులు శ్రద్ధ తీసుకోకపోవడంతో పరిసరాలు శిథిలాలుగా మారినా నిత్యం భక్తుల తాకిడి పెరిగింది. తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడ మొక్కలు తీర్తుకుంటే తిరుపతిలో తీర్చుకున్నట్లేననే నమ్మకం ప్రజల్లో ఉంది.

టెంపుల్‌ టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత.. ఆంధ్రప్రభతో మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌

రాష్ట్రంలో ప్రాచీన ఆలయాలతో పాటు చారిత్రిక ప్రాధాన్యత గల ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపర్చి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర క్రీడలు, పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. మన్యంకొండ అభివృద్ధి పై ఆంధ్రప్రభతో మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గల మన్యంకొండ పేదల తిరుపతిగా ప్రఖ్యాతి చెందిందన్నారు. మన్యంకొండ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినట్లు తెలిపారు.

సరిహద్దు రాష్ట్రాల భక్తులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు శ్రీవేంకటేశ్వరున్ని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారని చెప్పారు. దట్టమైన అడవిప్రాంతంలో ఉన్న ఈ ఆలయాల పరిసరాలతో పాటు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయాల పునరుద్ధరణ కేసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. గత సమైక్యపాలనలో తెలంగాణలోని చారిత్రిక, అధ్యాత్మిక కేంద్రాల పట్ల నిర్లక్ష్యం కొనసాగిందన్నారు. ఇప్పటికే యాదాద్రిని పునరుద్ధరించిన ప్రభుత్వం సుప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

మన్యంకొండకు రోప్‌ వే ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయన్నారు. రోప్‌ వేతో పాటుగా కేబుల్‌ కార్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. మన్యంకొండ భక్తుల సౌకర్యం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ కొండల్లో పర్వతారోహణకు అనువైన ప్రాంతాలను అభివృద్ధి చేసే యోచన ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement