బార్ లో భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14మంది మృతి చెందగా..పలువురికి గాయాలు అయ్యాయి..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని సోవెటో టౌన్‌షిప్‌లో జరిగింది. శనివారం రాత్రి కొందరు వ్యక్తులు మినీ బస్ ట్యాక్సీలో ఒక బార్ వద్దకు వచ్చారు. అక్కడ వినోదంలో మునిగి ఉన్న వారిపై విచక్షణా రహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో బార్‌లోని వ్యక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనలో 14 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరి కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం మృతదేహాలను వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.ఈ సంఘటనా స్థలంలో లభించిన తుపాకీ గుళ్ల ఆధారంగా ఒక బృందం సామూహిక కాల్పులకు పాల్పడినట్లుగా తెలుస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ బార్‌కు లైసెన్స్ ఉందని, అనుమతించిన సమయంలో తెరిచి ఉన్న బార్‌లో వ్యక్తులు ఎంజాయ్ చేస్తుండగా దుండగులు వారిపై కాల్పులు జరిపారని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ర్యాండమ్‌గా షూటింగ్ చేసినట్లుగా వారు వినియోగించిన గన్స్ ద్వారా తెలుస్తున్నదని అన్నారు. అయితే హంతకుల ఉద్దేశం ఏమిటి, వారు ఎందుకు ఈ సామూహిక కాల్పులకు పాల్పడ్డారు అన్నది అర్థం కావడం లేదని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.