టాటా సన్స్‌కు చెందిన ఎయిర్ ఇండియా భారీ విస్తరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 470 విమానాలకు అర్డరు ఇచ్చిన ఎయిర్ ఇండియాకు ఈ సంవత్సరం 31 విమానాలు రానున్నాయి. ఇవి కాక మరో 36 విమానాలను లీజ్‌కు తీసుకోనుంది. వీటి కోసం ఎయిర్ ఇండియా 900 మంది పైలట్లను , 4,200 మంది సిబ్బందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం 115 విమానాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా రానున్న 31 విమానాల్లో 6 ఎయిర్ బస్ ఏ 350ఎస్ విమానాలు, 25 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ఇటీవల ఆర్డర్ ఇచ్చిన 470 విమానాలు రానున్న 7 నుంచి 10 సంవత్సరాల్లో డెలివరీ అవుతాయని ఎయిర్ ఇండియా తెలిపింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రధానంగా లోకాస్ట్ సర్వీస్‌గా నడపనున్నారు. ఇవి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు కేటాయించారు.
లీజ్‌కు తీసుకోనున్న 36 విమానాల్లో ఇప్పటికే రెండు 777 ఎస్ బోయింగ్ విమానాలు ఆపరేషన్‌లోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా భారీగా విమానాలను కొనుగోలు చేస్తున్నందున అందుకు తగిన విధంగా విమాన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అవసరం అవుతారని ఇన్ ప్ల్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ తెలిపారు. కొత్తగా ఇంటర్నేషనల్, డొమస్టిక్ సర్వీస్‌లు పెరుగుతాయని, గతంలో ఎయిర్ ఏషియా నడిపిన కొన్ని మార్గాలను మార్చనున్నారని తెలిపారు. ఈ సర్వీస్‌లన్ని సక్రమంగా నడిపేందుకు సిబ్బంది పాత్ర చాలా కీలకమన్నారు. ఎయిర్ ఇండియా పెద్ద సంఖ్యలో పైలట్లలను, మెయింటెనెన్స్ ఇంజినీర్లను కూడా నియమించుకోనున్నట్లు సందీప్ వర్మ తెలిపారు.
గత సంవత్సరం మే నెల నుంచి ఇప్పటి వరకు శిక్షణ పూర్తయిన 1,900 మంది క్యాబిన్ సిబ్బందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వివరించారు. మరో 1,100 మంది మంది గత ఏడు నెలలుగా శిక్షణ పొందుతున్నారని, వీరిలో 500 మందికి మూడు నెలలుగా ఫ్లైయింగ్ డ్యూటీలు వేస్తున్నామని ఆయన వివరించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రానునందున భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. క్యాబిన్ సిబ్బందిగా తీసుకునే వారికి 15 వారాల పాటు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. టాటా గ్రూప్ అనుసరించే విధానాలు, పద్దతులు, సంస్కృతి ఉద్యోగులకు శిక్షణలో నేర్పిస్తామన్నారు. క్లాస్ రూమ్ శిక్షణతో పాటు, విమానాల్లో ప్రాక్టికల్ శిక్షణ కూడా ఉంటుంది.