కబడ్డీ.. కబడ్డీ.. ఖేలో కబడ్డీ.. అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో తిరుపతి పురవీధులు మారుమోగాయి. జనవరి 5 నుండి 9 వరకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్వహించనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల సన్నాహకాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ర్యాలీ విజయవంతం అయ్యింది. కృష్ణాపురం ఠానా వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా, ఎం.పి. గురుమూర్తి, కమిషనర్ గిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ డ్రమ్స్ కొట్టి, జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. కృష్ణాపురం ఠానా నుండి గాంధీరోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా ఇందిరామైదానం వరకు ఈ ర్యాలీ సాగింది. వేలాదిగా విచ్చేసిన విద్యార్థులు చేసిన కబడ్డీ నినాదాలతో తిరువీదులు మారుమోగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కబడ్డీ పోటీలను మునిసిపాలిటీ నిర్వహిస్తున్నదన్నారు.
ఇది ఆషామాషీ కార్యక్రమం కాదని 22 రాష్ట్రాల నుండి సుమారు 700 మంది క్రీడాకారులు, క్రీడాకారిణి లు వస్తున్నారన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు దేహదారుడ్యం పెంచాలన్న ఉద్దేశ్యం తో.మునిసిపాలిటీ ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు స్పూర్తితో మీ అందరిలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి కబడ్డీ నిర్వహిస్తోందన్నారు. నేటితరం పిల్లలు లాప్టాప్, సెల్ పోన్ లలో గేమ్ చూస్తున్నారని, దీని వలన కంపెనీలకు డబ్బులు వస్తాయే తప్ప బలం రాదన్నారు. కండ కలిగిన వారే మనిషోయ్ అన్నట్లు మనందరం దేహదారుడ్యం కలిగి ఉండాలన్నారు. ఈ కబడ్డీ పోటీల నిర్వహణతో దేశం మొత్తం తిరుపతి ని ఆదర్శంగా తీసుకునేలా నిర్వహిస్తున్నామన్నారు.
జనవరి 5 నుండి 9 వరకు నిర్వహించే ఈ కబడ్డీ పోటీలను పిల్లలందరూ వీక్షించాలన్నారు. ఎం.పి. గురుమూర్తి మాట్లాడుతూ ఈ కబడ్డీ పోటీలు నిర్వహించాలన్న ఒక గొప్ప ఆలోచన ఈ దేశంలో ఏ మునిసిపాలిటీ చేయని విధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ చేయాలన్న సంకల్పం కలిగిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు అన్నారు. కబడ్డీ పోటీలకు సహకరిస్తున్న కమిషనర్, మేయర్, అధికారులందరికి అభినందలు తెలిపారు. ఆటలంటే సెల్పోన్స్ కాదని, గ్రౌండ్ లోకి దిగి దేహదారుడ్యం పెంచుకోవాలన్నారు. మీ అందరిలో క్రీడాస్ఫూర్తి పెంచడం కోసం నిర్వహిస్తున్న ఈ క్రీడలు విజయవంతం కావాలన్నారు.
మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ మీ అందరిలో క్రీడాస్ఫూర్తి, ఆసక్తి పెంచాలని ఉద్దేశ్యంతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలను జనవరి 5 నుండి 9 వరకు జరుపుతున్నామన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారి ఒక మునిసిపాలిటీ ఈ స్థాయిలో కబడ్డీ నిర్వహించడం మనందరికి గర్వకారణం అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు..అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital