మన దేశంలో తయారవుతున్న మొబైల్ ఫోన్ల ఎగుమతులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మన దేశం నుంచి 85 వేల కోట్ల విలువైన మొబైల్ హ్యాండ్ సెట్స్ ఎగుమతులు జరిగాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ ద్వారా గత ఆర్ధిక సంవత్సరం ఎగుమతులతో పోల్చితే 2022-23లో రెట్టింపుయ్యాయి. మన దేశం నుంచి మొబైల్ ఫోన్లు ఎక్కువగా యూఏఈ, అమెరికా, నెదర్లాండ్స్, యూకే, ఇటలీ టాప్ 5 దేశాలుగా ఉన్నాయి. మన దేశంలో విక్రయం అవుతున్న మొత్తం మొబైల్ ఫోన్లలో 97 శాతానికి పైగా స్థానికంగానే ఉత్పత్తి అవుతున్నాయి.
భారత్ ప్రస్తుతం ప్రపంచలోనే రెండో అతి పెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో లక్ష కోట్ల ఎగుమతులు చేయడం లక్ష్యమని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. 2022లో 80-85 శాతం ఐఫోన్లను చైనా ఉత్పత్తి చేసింది. 2027 నాటికి ఇండియా నుంచి 45-50 శాతం యాపిల్ ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 చివరి నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో ఇండియా 10-15 శాతం వాటా కలిగి ఉంది.
చైనా నుంచి ఐఫోన్ల తయారీని వియత్నాం, ఇండియాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 40 బిలియన్ డాలర్లకు మించిపోయిందని, ఇందులో 25 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్రో చెప్పారు. పీఎల్‌ఐ స్కీమ్‌తో 2023లో లక్ష కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతి చేయగలమని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు.