Tuesday, November 26, 2024

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా పెరిగిన డెలివరీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు భారీగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యల కారణంగా గత ఆగస్టు నెలలో ఏకంగా 76.3 శాతం డెలివరీలు నమోదయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన డెలివరీలు 30 శాతంగా ఉండగా, తెలంగాణ ఏర్పడిన కొన్నేళ్లలోనే అవి రెట్టింపయ్యాయి. పిహెచ్‌సిల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం ఈ ఫలితాలకు ఒక కారణం. కాగా, గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకున్న వెంటనే న్యూట్రీషన్‌ కిట్‌, డెలివరీ అయిన వెంటనే కేసీఆర్‌ కిట్‌ ఇవ్వడం కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు భారీగా పెరగడానికి కారణం అవుతున్నాయి.

గర్భిణులకు రూపాయి కూడా ఖర్చు భారం పడకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు జరగడానికి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు కృషి చేస్తున్నారు. ఇక గర్బిణితో పాటు పుట్టిన శిశువు సైతం ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా మాతాశిశు సంరక్షణ కేంద్రాలు వైద్య చికిత్సలు అందిస్తున్నాయి. ఏ ఒక్క గర్బిణి కూడా పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టిఫా సహా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీర్ఘకాలిక రోగాలు, ఇతర క్లిష్టమైన సమస్యలతో ఉన్న గర్భిణులకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య చికిత్సలు అందుతున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా, గత నెలలో అత్యధికంగా నారాయణ్‌పేటలో 89 శాతం, ములుగు 87 శాతం, మెదక్‌ 86 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 84 శాతం, వికారాబాద్‌ 83 శాతం, గద్వాల్‌ 85 శాతం డెలివరీలు నమోదయ్యాయి. అతి తక్కువగా మంచిర్యాల 63 శాతం, నిర్మల్‌ 66 శాతం, మేడ్చల్‌, కరీంనగర్‌ 67 శాతం నమోదయ్యాయి. ఓవరాల్‌ పనితీరు విషయంలో మొదటి స్థానంలో మెదక్‌ 84.4, జోగులాంబ గద్వాల 83.9, వికారాబాద్‌ 81, ములుగు 79, నాగర్‌కర్నూలు 77 శాతంగా నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు.

మంగళవారం ఆశాలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్‌ డా.శ్రీనివాసరావుతో పాటు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలనీ, కేసీఆర్‌ కిట్‌ ఆధారంగా డెలివరీ డేట్‌ తెలుసుకుని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనీ, అన్ని పిహెచ్‌సిలలో మందులు అందుబాటులో ఉంచాలనీ, ఎక్కడా ఏదీ లేదనే పరిస్థితి రానివ్వవద్దని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement