Tuesday, November 26, 2024

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. తుదిదశకు చేరుకున్న కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుల దిశగా కసరత్తు తుదిదశకు చేరుకుంది. కీలకమైన శాఖలు మినహా దాదాపు అన్ని శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరుగుతుందని చాలా రోజుల క్రితం నుంచే కథనాలు, ఊహాగానాలు వెలువడ్డాయి. నిజానికి ఒకట్రెండు నెలల ముందే జరగాల్సిన ఈ కసరత్తును శుభదినాలుగా భావించే ఉత్తరాయణ కాలంలో చేపట్టాలని అధినేతలు భావించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న వేళ ఈ కసరత్తును వెంటనే అమలు చేస్తారా లేక, బడ్జెట్ సమావేశాల మధ్యలో విరామ సమయంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడతారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కసరత్తు మాత్రం దాదాపుగా పూర్తయిందని, ఎవరెవరికి ఉద్వాసన పలకాలో వారికి సమాచారం కూడా ఇచ్చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉద్వాసనకు గురయ్యేవారిలో సహాయమంత్రులే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒకరిద్దరు కేబినెట్ మంత్రులు కూడా ఉండవచ్చని సమాచారం. అయితే ఉద్వాసనకు గురయ్యే మంత్రులు, సహాయమంత్రులందరూ పనితీరు కారణంగా పదవి కోల్పోతున్నారని భావించడానికి వీల్లేదని, కొందరిని పార్టీ ఇతర అవసరాల కోసం ఉపయోగించుకుంటుందని చెబుతున్నారు. నిజానికి ఈ తరహా కసరత్తు గత విస్తరణలోనే జరిగింది. మంత్రివర్గంలో కీలక పదవుల్లో ఉన్న రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్ వంటి నేతలకు ఉద్వాసన పలికి, కొత్తవారికి చోటు కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డి, నేరుగా కేబినెట్ ర్యాంక్‌కు పదోన్నతి పొంది పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు సైతం గత విస్తరణలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

మోదీ-షా ద్వయం నాయకత్వంలో పార్టీలో, ప్రభుత్వంలో జరిగే మార్పులు మిగతావారికి ఊహకు, అంచనాలకు భిన్నంగా ఉంటున్నాయి. చివరి క్షణం వరకు ఎవరికి ఏ పదవి దక్కుతుందో పదవి పొందేవారికి సైతం తెలియడం లేదు. అంతటి గోప్యతను అమలు చేస్తున్న మోదీ-షా ద్వయం.. ఈసారి కూడా ఆస్థాయిలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే మార్పులు, చేర్పులు చేపడతారని తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన విస్తరణలోనూ ఆ సమయానికి అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంటున్న రాష్ట్రాలకు పెద్దపీట వేసినట్టే, ఈసారి విస్తరణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ ప్రాతినిథ్యం కల్పిస్తారని చర్చ జరుగుతోంది.

- Advertisement -

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీట

ఈ ఏడాది 4 ఈశాన్య రాష్ట్రాలు సహా మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికల తేదీలు విడుదలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉంది. ఇవి మినహాయిస్తే మిగతా భూభాగంలో మధ్యభారత దేశంలోని మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌తో పాటు దక్షిణాదిన తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలో మే చివరి నాటికి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాలకు కేంద్రమంత్రివర్గం విస్తరణలో పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల నుంచి చోటు కల్పించడం కోసం గతంలో సహాయమంత్రులుగా తీసుకున్న పలువురికి ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. గత విస్తరణలో త్రిపుర రాష్ట్రం నుంచి ప్రతిమ భౌమిక్‌కు సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు పార్టీ ఆమెను త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపింది. ఈ తరహాలోనే మరికొందరిని పార్టీ ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది.

కీలక శాఖలు మినహా…

మంత్రివర్గంలో కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, వాణిజ్య-పరిశ్రమలు, జాతీయ రహదారుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ శాఖలు మినహా మిగతా శాఖల్లో మార్పులు, చేర్పులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి, మరింత కీలకమైన బాధ్యత అప్పగిస్తారని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం తరఫున ఆయనకు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా పనిచేసి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న హర్దీప్ సింగ్ పురికి విదేశాంగ శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులను వాటిలో ఏదైనా ఒక శాఖకు పరిమితం చేసి, కొత్తవారికి మిగతా శాఖల బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణకు మరో బెర్త్?

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాతినిథ్యం కల్పించే సూత్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి మరో బెర్త్ దక్కవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఆయనతో పాటు గెలుపొందినవారిలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగుస్తున్నప్పటికీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగించనున్నట్టు అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక మిగిలినవారిలో ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డా. కే. లక్ష్మణ్ కూడా తెలంగాణకు చెందినవారే. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే ధర్మపురి అరవింద్, డా. లక్ష్మణ్, బండి సంజయ్ ముగ్గురూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు.

వీరిలో ఒకరు రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండగా, మరొకరు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా, కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గిరిజన-ఆదివాసీ వర్గానికి చెందిన సోయం బాపూరావుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని గిరిజన ఓటును దృష్టిలో పెట్టుకుంటే బాపూరావుకు అవకాశం కల్పించవచ్చు. నిజానికి గత విస్తరణలోనే బాపూరావుకు పిలుపు అందినప్పటికీ చివరి క్షణంలో గిరిజన ‘మహిళ’కు అవకాశం కల్పించారు. మొత్తంగా కేంద్ర మంత్రివర్గంలో చేరికలు, తీసివేతలతో పాటు శాఖల్లోనూ భారీగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement