ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఆరో రోజైన మంగళవారం కూడా బాంబుల మోత మోగుతున్నది. కీవ్, ఖర్కీవ్‌లోని నివాస ప్రాంతాలపై బాంబు దాడులకు దిగాయి రష్యా సైన్యాలు. దీంతో క్షణాల్లోనే భారీ భవనాలు కూడా నేల మట్టం అయ్యాయి. సోమవారం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో.. రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపుగా రష్యా సైన్యాలు భారీగా మోహరిస్తున్నాయి. కీవ్, ఖర్కీవ్‌పై ముప్పేట దాడికి రష్యన్ ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మరికొన్ని గంటల్లోనే.. కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు భారీ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించుతున్నాడు. సైనిక వాహనాలు, ఫిరంగులు, యుద్ధ ట్యాంకులతో కీవ్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలు నిండిపోతున్నాయి. ఉక్రెయిన్ రాజధానిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
జోరు పెంచిన పుతిన్..
నివాస ప్రాంతాలపై కూడా రష్యా బాంబు, క్షిపణి దాడులకు దిగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో నివాసం ఉంటున్న లక్షలాది ప్రజలు.. తమ పిల్లా పాపలతో కలిసి దేశం విడిచి వెళ్లిపోతున్నారు. గత ఐదు రోజులతో పోలిస్తే.. ఆరో రోజైన మంగళవారం రష్యా భారీ సాయుధ బలగాలను రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది. రష్యా తన సైన్యంలోని సగం ఆర్మీని ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని ఇతర నగరాలనూ చేజిక్కించుకోవడానికి భీకర దాడులు చేస్తున్నది. ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన 70 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పదుల సంఖ్యలో సాధారణ పౌరులు కూడా మరణించారని ఉక్రెయిన్ వర్గాలు ప్రకటించాయి. రష్యా దాడులు ప్రారంభించాక.. ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు వందకు పైగా సాధారణ పౌరులు చనిపోయినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ధీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్..
రష్యా ఆర్మీని తాము కూడా ధీటుగా ఎదుర్కొంటున్నట్టు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. రష్యా కూడా 5710 మంది సైన్యాన్ని కోల్పోయిందని తెలిపింది. 29 యుద్ధ విమానాలను ధంసం చేసినట్టు వివరించింది. 200కు పైగా యుద్ధ ట్యాంకులను పేల్చేశామని చెప్పుకొచ్చింది. కీవ్, ఖర్కీవ్ నగరాల విషయానికొస్తే.. గంట గంటకూ పరిస్థితి చాలా తీవ్రంగా మారుతున్నది. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన కీవ్ నగరం ఇప్పుడు స్మశానంగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటైన కీవ్.. రష్యా దాడులకు చిగురాటకులా వణికిపోతున్నది. దాడులను ఎదుర్కోవడానికి ఆర్మీ బలగాలే కాకుండా.. ఉక్రెయిన్ సాధారణ పౌరులు కూడా ఆయుధాలు పట్టుకుని రంగంలోకి దిగారు. వాతావరణం రీత్యా జనవరి-ఫిబ్రవరి మధ్య మైనస్ 4.6 డిగ్రీల నుంచి మైనస్ 1.1 డిగ్రీల మధ్య ఉండే కీవ్.. నవంబర్ నుంచి మార్చి వరకు మంచుతో కప్పబడి ఉండి.. అత్యంత సుందరమైన నగరంగా చెప్పుకునే కీవ్‌లో భవంతులు.. కూడా ఐరోపా నాగరికతతో కనిపిస్తుంటాయి. రష్యా బలగాలు చేస్తున్న దాడులకు ఆ ప్రాంతం అంతా.. రక్తసిక్తంగా మారింది. ఆర్తనాదాలు, విప్లవ జాలలతో వేడెక్కిపోతున్నది.
చర్చలు విఫలంతో భారీ దాడులు..
రష్యా మొదట వేసుకున్న ప్రణాళికల ప్రకారం.. కీవ్ ఇప్పటికే హస్తగతం కావాలి. కానీ ఉక్రెయిన్ ఆర్మీ నుంచి ఊహించని విధంగా ఎదురవుతున్న ప్రతిఘటన కారణంగా ఇది జరగలేదు. నాటో దేశాలు ఇస్తున్న ఆయుధాలు.. ధైర్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఉక్రెయిన్ ఆర్మీ ధీమాను చూస్తుంటే.. ఇప్పట్లో జరిగేలా కనిపించలేదు. అయితే తాజాగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. రష్యా దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. రష్యా బలగాలు వెనక్కి తగ్గాయన్న వార్తలు ఇప్పుడు తప్పు అనిపిస్తున్నాయి. వెనకడుగు వేసింది.. మరింత దూకుడుగా దూసుకుపోవడానికి అని ఇప్పుడు అర్థం అవుతోంది. ఇక ఆలస్యం చేస్తే.. మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో ఉన్న పుతిన్.. ఉక్రెయిన్‌పై దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. అందుకే ఇక జనావాసాలు అన్న తేడా లేకుండా.. అన్ని ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నాడు. ప్రజలంతా కీవ్‌ను వదిలి వెళ్లిపోవాలంటూ.. రష్యా చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే.. రష్యన్ ఆర్మీ దాడులను తీవ్రతరం చేసేందుకు నిర్ణయించినట్టు అర్థం అవుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..