Tuesday, November 26, 2024

ఎయిర్‌పోర్టు మెట్రో శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు.. ప్రారంభోత్సవం తర్వాత రాజేంద్రనగర్‌లో సీఎం బహిరంగసభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండో దశ మెట్రోరైలు విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపనకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా జరగనున్న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ఏర్పాట్లపై ఇటీవలే నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జీహెచ్‌ఎంసీ మేయర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు.

రూ.6250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించాలని ఇటు ప్రభుత్వం, అటు టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అధికారిక శంకుస్థాపన కార్యక్రమం పూర్తవగానే రాజేంద్రనగర్‌లోని పోలీస్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయడానికి మంత్రి తలసాని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఐటీ కారిడార్‌కు కలిసిరానున్న ప్రాజెక్టు…

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇప్పటివరకు కేవలం రోడ్డు మార్గమే అందుబాటులో ఉంది. దీంతో ఐటీ కారిడార్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారంతా క్యాబులను, సొంత వాహనాలను వినియోగించేవారు. వీరికి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువగానే వృథా అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న ఎయిర్‌పోర్టు ఎక్స్‌ ప్రెస్‌ ప్రాజెక్టు రానున్న 3 సంవత్సరాల్లో పూర్తయితే ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అతి త్వరగా విమానాశ్రాయానికి వెళ్లే వెసులుబాటు దొరుకుతుంది. ఇంతే కాకుండా వారికి ప్రయాణ ఖర్చు కూడా కలిసిరానుంది. కేవలం ఐటీ ఉద్యోగులే కాకుండా విమానాశ్రయానికి వెళ్లే ఇతర ప్రయాణికులకు కూడా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు కలిసిరానుంది. ఎక్కడ మెట్రో ఎక్కినా రాయదుర్గం వచ్చి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

త్వరలో టెండర్లు….

ఎయిర్‌ పోర్టు మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎమ్‌ఎల్‌) సంస్థ ద్వారా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. బీవోటీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వ నిధులతోనే అత్యంత వేగంగా కాంట్రాక్టు ఏజెన్సీతో ప్రాజెక్టు నిర్మించనుంది. ప్రజారవాణాకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేయాలని భావిస్తోందని ఇటీవలే మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రభుత్వమే నిర్వహిస్తుందా లీజుకు ఇస్తుందా త్వరలో స్పష్టత వస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement