ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రేపు (ఆదివారం) నిర్వహించే ఎయిర్ షో కు భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, వారికి ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్బంగా 8వ తేదీన వైమానిక ప్రదర్శన, 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై నేడు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హరీష్, అడిషనల్ సీపీ విక్రంజీత్ మాన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో పాటు, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఈ ఎయిర్ షో వీక్షించడానికి హాజరవుతున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షో లో సూర్యకిరణ్ కు చెందిన తొమ్మిది విమానాలు పాల్గొంటాయని తెలిపారు. ఈ రకమైన విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీమ్ లకు మాత్రమే ఉందని, అందులో ఒక టీమ్ హైదరాబాద్ లో చేయుట మన రాష్ట్రానికే గర్వ కారణం అని ఆమే పేర్కొన్నారు.
ఈ షోతో పాటు సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ట్ కు నక్లెస్ రోడ్, పీవీ మార్గ్ లలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, వీరి సౌకర్యార్థం ఇప్పటికే ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎయిర్ షో అనంతరం రాహుల్ సింప్లి గంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున, తగు మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని పేర్కొన్నారు.
లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజైన 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని తెలిపారు. సచివాలయ ఆవరణలో జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది పాల్గొంటారని, ఇందుకు తగు ఏర్పాట్లు చేయాలని సిఎస్ సూచించారు.
ఆవిష్కరణ సందర్బంగా దాదాపు 150 మంది ప్రముఖులు ఆసీనులయ్యేలా ప్రధాన వేదిక తోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదిక ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులకు, నగర ప్రముఖులకు ఆహ్వానాలను సకాలంలో పంపాలని తెలిపారు.
అనంతరం, ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్, వారికి కనీస సౌకర్యాల ఏర్పాటు, తదితర అంశాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఇలంబర్తి, సీడీఎంఏ శ్రీదేవి, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
నెక్లస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్ లలో పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని నగర పోలీస్ అడిషనల్ కమీషనర్ విక్రంజీత్ సింగ్ మాన్ తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలను ఎక్కువ దూరం నడవకుండా వేదిక సమీపంలో వాహనాలను అనుమతించి, అనంతరం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సిఎస్ సూచించారు.
సీఎం ను కలిసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం….
కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం (8వ తేదీన) సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ పై నుంచి నిర్వహిస్తున్న ఎయిర్ షోకు ఆహ్వానం అందజేసి వివరాలను తెలియజేశారు.