Tuesday, November 26, 2024

ఇద్ద‌రు సిక్కు వ్యాపారుల దారుణ హ‌త్య – పాకిస్థాన్ లో ఘ‌ట‌న‌

ఇద్ద‌రు సిక్కు వ్యాపారులు దారుణ హ‌త్య‌కి గుర‌య్యారు. ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బైక్ పై వ‌చ్చి స‌ల్జీత్ సింగ్, రంజీత్ సింగ్ పై కాల్పులు జ‌రిపారు. ఈ సంఘ‌ట‌న పాకిస్థాన్ సర్బంద్ పట్టణంలోని బాటా తాల్ బజార్‌లో చోటు చేసుకుంది. కాగా తీవ్రంగా గాయపడిన వ్యాపారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సిక్కు వ్యాపారుల హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా దీనిని అభివర్ణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని అయిన పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యాపారులే. వీరిపై దాడులు సర్వసాధారణంగా మారాయి. గతేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హకీం, అంతకుముందు ఏడాది ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రవీందర్ సింగ్, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్‌జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. కాగా, తాజా హత్యలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఖండించారు. పాక్ ప్రభుత్వం సిక్కుల భద్రతకు చర్యలు తీసుకోకుండా నోటి మాటలతోనే సరిపెడుతోందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని విమర్శించారు. తాజా హత్యల విషయంలో ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించాలంటూ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement