కీవ్:తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంలోని అనేక పట్టణాలు, పల్లెల్లో రష్యా నరమేధానికి పాల్పడుతోందని, సాధారణ పౌరులు, నివాసాలు లక్ష్యంగా దాడులకు తెగబడుతోందని, ఫలితంగా భారీ ప్రాణనష్టం సంభవిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస జినోసైడ్ కన్వెన్షన్‌కు విరుద్ధంగా పుతిన్ సేనలు అకృత్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రష్యాను సమర్థంగా తిప్పికొట్టడానికి అత్యాధునిక భారీ ఆయుధాలు అవసరమని, అమెరికా, పశ్చిమ దేశాలు తమకు రాకెట్ లాంచింగ్ వ్యవస్థలను అందించాలని కోరారు. ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని జోరియా, లిమన్, మరింకా, పోస్నా, మరింక, సివిరోడోనెట్‌స్క్, లిసిచాన్‌స్క్ వంటి పట్టణాలపై రష్యా విరుచుకుపడోందని, అన్ని యుద్ధ నియమాలను ఉద్దేశించి దాడులు చేస్తోందని ఆరోపించారు. మరియపోల్, వోల్నోవ్‌ఖా పట్టణాల్లో మాదిరిగా గ్రామాలకు గ్రామాలను శిథిలాల గుట్టలుగా మార్చేస్తోందని, ఉక్రెయిన్ పౌరులను తరిమేస్తోందన్నారు. రష్యా యుద్ధంపై ఐరోపా దేశాలు మీనమేషాల లెక్కపెడుతున్నాయని, ఆరవ దఫా ప్యాకేజీ అందించడంలో కాలయాపన చేస్తున్నాయని, రష్యా విషయంలో ఆటలాపి తమకు మరింత సాయం అందించాలని కోరారు. అత్యంత అధునాతన, భారీ ఆయుధాలు తక్షణం సరఫరా చేయాలని, అవి అందితే రష్యాను తరిమికొట్టగలమని విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా శుక్రవారంనాడు పేర్కొన్నారు.
అంతకుముందు ఆయన జర్మనీతో ఆయుధ సరఫరాపై సంప్రదింపులు జరిపారు. కాగా తూర్పు ఉక్రెయిన్‌లో కీలక నగరమైన సీవీరోడోనెట్‌స్క్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలువిశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇతర ప్రాంతాలనుంచి అదనపు బలగాలు ఇక్కడకు చేరుకున్నాయి. నగరానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశాయి. అనేక భవంతులపై క్షిపణులతో నేలమట్టం చేశాయి. రష్యా దాడుల్లో కనీసం 1500 మరణించారని గవర్నర్ ఒలెక్జాండర్ స్ట్రియుక్ ప్రకటించారు. నగరంలోని 60 శాతం భవనాలు నేలమట్టమయ్యాయని, ప్రస్తుతం 15వేలమంది పౌరులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. డోన్‌బాస్ రీజియన్‌లోని సీవిరోడోనెట్‌స్క్ నగరం మాత్రమే ఉక్రెయిన్ చేతుల్లో ఉంది. మిగతా ప్రాంతం అంతా దాదాపు రష్యా స్వాధీనం చేసుకుంది. దాంతో దీనిని కూడా స్వాధీనం చేసుకుని పూర్తిగా ఆ ప్రాంతంతో ఉక్రెయిన్‌కు సంబంధాలు లేకుండా చేయాలని రష్యా దాడులు ముమ్మరం చేసింది. కాగా తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా నరమేధానికి పాల్పడుతూండటం వాస్తవమేనని అంతర్జాతీయ న్యాయనిపుణులు, మానవ హక్కుల ఉద్యమ ప్రముఖులు స్పష్టం చేశారు. ఈ మేరకు రష్యా అకృత్యాలను వివరిస్తూ శుక్రవారం నివేదిక విడుదల చేశారు. కాగా లిమన్ పట్టణాన్ని శుక్రవారంనాడు రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదే ప్రాంతంలోని లుగాన్‌స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు తహతహలాడుతున్నాయి. ఫిరంగిదళాలతోను, వైమానిక దాడులతోను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ద్నిప్రో పట్టణంలో శుక్రవారం రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పట్టణం రొస్తోవ్‌లోని ఉక్రేనియన్ నేషనల్ గార్డ్ స్థావరాన్ని రష్యా క్షిపణులతో ధ్వంసం చేసింది.