Tuesday, November 26, 2024

Big Story : భారంగా మారిన సన్నాల సాగు.. రైతులను నిండా ముంచుతున్న వ్యాపారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టించి సన్నాలు సాగు చేస్తే వ్యాపారులు, దళారులు నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దున్నకం ఖర్చులు, యూరియా, తదితర కాంప్లెక్స్‌ ఎరువుల ఖర్చులు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రాక సన్న ధాన్యం సాగు రైతుకు గుదిబండగా మారింది. గిట్టుబాటు ధర రాక వ్యాపారులు, దళారులు చెప్పిన రేటుకే పంటను అమ్మాల్సి వస్తోందని, ఫలితంగా పెట్టుబడులు కూడా గిట్టుబాటుకావడం లేదన్న ఆందోళనలో రైతులు ఉన్నారు.

రాష్ట్రంలో ప్రతీ ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా సన్నరకం వరి సాగవుతుంటుంది. ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, శ్రీరామ, కావేరి, శ్రీ101 సూపర్‌ ఫైన్‌ రకాలను తెలంగాణ రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నల్గొండ, నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సన్నరకం వరిని రైతులు సాగు చేశారు.
కేంద్ర ప్రభుత్వం దొడ్డురకం, సన్నరకం వరి ధాన్యానికి ఒకే మద్దతు ధరను ప్రకటించడంతో సన్నాలకు వ్యాపారులు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ మేరకు ధర చెల్లించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగమార్కెట్‌లో సన్నాలకు ఎక్కువ ధర వస్తుండడంతో రైతులు దిగుబడి తక్కువగా వస్తుందని తెలిసినా సన్నాలను సాగు చేశారు.

తీరా పంట చేతికొచ్చాక దొడ్డు రకం ధాన్యానికి వచ్చినంత ధర కూడా రావడం లేదని వాపోతున్నారు. దళారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది సూపర్‌ఫైన్‌ వరి ధాన్యానికి రూ.2400 దాకా ధర పలికింది. హైదరాబాద్‌, మిర్యాలగూడ, కరీంనగర్‌, వరంగల్‌తోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి పొలాల్లోనే ఖరీదు చేసే ధాన్యాన్ని తీసుకెళ్లేవారు. అయితే ఈ ఏడాది ప్రస్తుత ఖరీఫ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గతేడాది బహిరంగ మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి రూ.2300 దాకా ధర ఉండేది. ఈ ఏడాది రూ.1800 నుంచి రూ.1900 వరకే వ్యాపారులు ధర పెడుతున్నారు.

- Advertisement -

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వర్షాలు, తేమతో కూడిన చలిగాలులు, మంచు కురుస్తుండడంతో కోసిన వెంటనే పంటను అమ్ముకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కల్లాల వద్దకే వస్తున్న వ్యాపారులు సిండికేట్‌గా మారి క్వింటాల్‌కు రూ. 1800 నుంచి రూ.1950 కు మించి మద్దతు ధర చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారుల సిండికేట్‌కు జిల్లాల్లోని మార్కెటింగ్‌ శాఖ అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్‌లో కల్లాలు తెరవాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. వ్యవసాయ మార్కెట్‌లలో కల్లాలు తెరిస్తే సన్నరకం ధాన్యానికి డిమాండ్‌ పెరుగుతుందని , వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధాన్యానికి అధిక ధర లభిస్తుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
గతేడాది మాదిరిగానే నష్టానికి రైతులు ధాన్యాన్ని అమ్ముకున్న తర్వాత సన్న ధాన్యానికి రెక్కలు వస్తాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా వ్యాపారులు కావాలని చేస్తున్న పనేనని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement