ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ అన్ని వాహనాల మోడల్స్ ధరలను 0.45 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఇవ్వాల్టి (జనవరి 16) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. మారుతీ సుజుకీ విక్రయించే కార్ల ధరలు 3.54 లక్షల నుంచి 28.42 లక్షల వరకు ఉన్నాయి. మారుతీ సుజుకీ ఆల్టో, సెలారియో, స్విఫ్ట్ , డిజైర్, బాలినో, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ఎన్6, ఓమిన్నీ, క్లేజ్, ఇన్విక్టో వంటి మోడల్స్‌ను విక్రయిస్తోంది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన ందునే ఆ భారాన్ని కొంతమేర వినియోగదారులకు బదలీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. జనవరి నుంచి ధరలు పెంచుతామని మారుతీ సుజుకీ గత సంవత్సరం నవంబర్లోనే ప్రకటించింది.
మారుతీ సుజుకీతో పాటు వోల్వో ఇండియా కూడా తన కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వోల్వో ఎలక్ట్రిక్ కార్ల ధరలను మాత్రం పెంచడంలేదని తెలిపింది. 2030 నాటకి వోల్వో పూర్తిగా విద్యుత్ కార్ల తయారీ కంపెనీగా మారుతునందున వీటి ధరలను అలానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. పలు కార్ల కంపెనీలు నవంబర్, డిసెంబర్లో తాము జనవరి నుంచి ధరలు పెంచుతామని ఇదివరకే ప్రకటించాయి. దీన్ని మారుతీ సుజుకీ, వోల్వో కంపెనీలు అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. వోక్సోవ్యాగన్, హోండా ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్, టాటా మోటార్స్, డ్యుకాటీ, మెర్సిడెస్‌బెంజ్, ఆడీ కార్ల కంపెనీలు కూడా జనవరిలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.