Tuesday, November 26, 2024

రేపో, మాపో బీజేపీలో చేర‌నున్న మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి.. ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయ‌మైంది. ఈ మేర‌కు ఆయ‌న ఇవ్వాల (శుక్ర‌వారం) కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షాతో భేటీ అయిన‌ట్టు స‌మాచారం అందుతోంది. మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డితోపాటు బీజేపీ హైక‌మాండ్‌ని క‌లిసిన వారిలో ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, మ‌రో నేత డీకే అరుణ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, ఇవ్వాల అమిత్‌షాతో జ‌రిగిన భేటీలో పార్టీలో చేరికల‌కు సంబంధించి అంశంపై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. హైదరాబాద్ వెళ్లి కార్యాకర్తలతో మాట్లాడి మంచిరోజు బీజేపీలో చేర‌తాన‌ని మ‌ర్రి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌.. జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం. అమిత్ షా భేటీ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ నివాసంపై దాడి గురించి చెప్ప‌గా.. వెంట‌నే ఫోన్‌లో అర్వింద్‌తో మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది.

================================

- Advertisement -

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికపై స్పష్టత వచ్చింది. శుక్రవారం రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా తో సమావేశమయ్యారు. పార్జీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్రాధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో ఆయన అమిత్ షాను కలిశారు. పార్టీలో చేరిక గురించి ఆయనతో చర్చించారు. హైదరాబాద్ తిరిగొచ్చి తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి ఓ మంచి రోజు చూసుకుని కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలిసింది. బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో వచ్చే వారం పార్టీలో చేరనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మర్రి శశిధర్ రెడ్డిని అమిత్ షా ఇంటికి తీసుకెళ్లిన నేతలిద్దరూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై జరిగిన దాడి ఘటన గురించి వివరించారు. దీంతో అమిత్ షా వెంటనే అరవింద్‌కు ఫోన్ కలిపి పరామర్శించారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడ్రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ చేరుకోవడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. వేర్వేరు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్న ఆయన, ఒక కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకే ఢిల్లీ వచ్చినట్టు తొలుత చెప్పారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన పలువురు పార్టీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. నిజానికి సాయంత్రమే హైదరాబాద్ తిరిగి వెళ్తారని చెప్పారు. కానీ అమిత్ షా ను కలిసి మర్రి శశిధర్ రెడ్డి వ్యవహారం, అరవింద్ నివాసంపై దాడి ఘటన గురించి చర్చించడం కోసమే ఆయన తన తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. రాత్రి గం. 9.45 సమయంలో డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డిని తమ వెంట అమిత్ షా ఇంటికి తీసుకెళ్లారు.

జాబితాలో ఇంకా కొందరు…

రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తున్న సమయంలో.. బీజేపీలోకి చేరికలను బాహటంగా, అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున చేపట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరికల వ్యవహారం ఏదీ రహస్యం కాదని, చేరికల కోసం ఎలాంటి బేరసారాలు ఉండవని చాటిచెప్పాలని చూస్తోంది. బీజేపీ మీద టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీలో చేరికల అంశాన్నే ఆయుధంగా తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అధిష్టానం చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తోనూ చర్చించినట్టు తెలిసింది. మర్రి శశిధర్ రెడ్డి చేరికలో కీలక పాత్ర పోషించిన జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గతంలోనూ పలువురు కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరిగినప్పటి నుంచి నానాటికీ సీనియర్లలో అసంతృప్తి పెరిగిపోతుండడం, పాత తరం నేతలు ఇమడలేని పరిస్థితి ఏర్పడడం వంటి అంశాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు డీకే అరుణ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కరడుగట్టిన కాంగ్రెస్‌వాదులుగా పేరున్న మర్రి శశిధర్ రెడ్డి వంటి వ్యక్తినే బీజేపీ వైపు ఆకట్టుకోగలిగారు. ఇంకా ఆయన బాటలో చాలా మంది సీనియర్ నేతలున్నట్టు తెలుస్తోంది. బాహాటంగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు చేస్తున్న మరికొందరు నేతలు సైతం కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. మరికొందరు పార్టీని వీడలేక, ఉండలేక తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి బీజేపీ నాయకత్వంలోని నేతలు పోటీలు పడి ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement