న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఎనిమిదిన్నరేళ్లుగా ‘ఫ్యామిలీ ఫస్ట్’ నినాదంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కుటుంబాన్ని గద్దెదించే సత్తా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మాత్రమే ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. శశిధర్ రెడ్డికి కేంద్ర మంత్రులు శర్బానంద్ సోనోవాల్, కిషన్ రెడ్డి పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేశారు. వేదికపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ – ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్, వివేక్ వెంకటస్వామి, పార్టీ సమన్వయకర్త (తెలంగాణ) నూనె బాల్‌రాజ్ ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేసిన వెంటనే బండి సంజయ్ పార్టీ కండువా కప్పగా, మిగతా నేతలు పుష్ఫగుచ్ఛాలిచ్చి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదిక మీద నుంచి మర్రి శశిధర్ రెడ్డి నేపథ్యం గురించి డా. లక్ష్మణ్ అందరికీ వివరించారు.
మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఆయన చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతమవుతుందని, టీఆర్ఎస్ కుటుంబ పాలన అంతమవుతుందని అన్నారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డితో కలిసి నేతలందరూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నివాసానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన మర్యాదపూర్వక భేటీలో అధ్యక్షులు జేపీ నడ్డా కూడా మర్రి శశిధర్ రెడ్డికి మరోసారి కండువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం నేతలు అరగంటకు పైగా తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ హైకోర్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌కు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తెలంగాణ సిట్ ఇచ్చిన 41(ఏ) సీఆర్పీసీ నోటీసుపై ‘స్టే’ ఇచ్చింది. ఈ సమాచారాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ కేసు గురించి కూడా నేతలు కాసేపు చర్చించుకున్నట్టు తెలిసింది.
కార్యకర్తగా చేరా.. ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా.. మర్రి శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరడానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరిన అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో, అనంతరం జేపీ నడ్డా నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అవేవీ నెరవేరని పరిస్థితి నెలకొందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, ‘ఫ్యామిలీ ఫస్ట్’ నినాదంతో ఆ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఆరోపించారు. ఇంత అవినీతికి పాల్పడ్డ రాజకీయ పార్టీ ప్రపంచంలోనే మరెక్కడా ఉండదని ఆయనన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ దోపిడీని, అరాచకాలను ఏమాత్రం అడ్డుకోలేకపోయిందని అన్నారు. ఇంకా చెప్పాలంటే ‘టీఆర్ఎస్’తో కుమ్మక్కు వ్యవహారాలే ఎక్కువగా జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు కూడా ఈ విషయం అవగతమైందని, టీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఎదుర్కొంటుందన్న విశ్వాసం కూడా పూర్తిగా సన్నగిల్లిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ‘తెలంగాణ ఫస్ట్’ నినాదంతో ముందుకెళ్తోందని, అందుకే తాను ఆ పార్టీలో చేరానని చెప్పారు.
తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్‌తో మొదలైందేమీ కాదని, తన తండ్రి మర్రి చెన్నారెడ్డి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన పోరాటం, రాజకీయ ప్రయత్నాలను ఆయన గుర్తుచేశారు. ఈ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటుందని, టీఆర్ఎస్‌ను అడ్డుకోవడం కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ సర్కారేనని, అందుకోసం తాను ప్రాణాలొడ్డి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. బీజేపీలోని క్రమశిక్షణ, సిద్ధాంతంతో తనకెలాంటి సమస్యా లేదని, తాను ఏ పనిచేసినా మనస్ఫూర్తిగా చేయడం అలవాటని అన్నారు. అత్యంత క్రమశిక్షణతో మెలిగిన నేతగా తనకు గుర్తింపు ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రతిభను గుర్తించలేదని, తనకు సోనియా గాంధీ ఇచ్చిన పదవులు – బాధ్యతల విషయంలో ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటానని అన్నారు. కానీ పార్టీలో ఆమె నిస్సహాయురాలిగా మారిపోయారని, ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. బీజేపీలో ఏ పదవులూ ఆశించి చేరలేదని, ఓ సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలు అందిస్తానని, ఈ క్రమంలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు.
మర్రి చేరికతో కాంగ్రెస్ ఖేల్ ఖతం: డా. లక్ష్మణ్
రెండు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీతో విడదీయరానంత అనుబంధాన్ని కల్గిన మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీ వీడడమే ‘కాంగ్రెస్ ఖేల్ ఖతం’ అనడానికి సంకేతమని డా. లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కొడుకైన శశిధర్ రెడ్డి కేంద్ర కేబినెట్ ర్యాంక్ కల్గిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా పనిచేశారని ఆయన గురించి చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలిందేమీ లేదని అన్నారు.
బీజేపీని ఎదుర్కోలేక లోపాయకారి ఒప్పందాలు: బండిసంజయ్
తెలంగాణలో నానాటికీ బలపడుతున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్, కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో ప్రజలు డబులింజన్ సర్కారుకే పట్టం కడతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో మంచి ఆలోచనతో బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు.
టీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తమ కుటుంబమే దిక్కు అన్నట్టుగా, ప్రజలందరూ ఆ కుటుంబానికి బానిసలుగా ఉండాలన్నట్టుగా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే టీఆర్ఎస్ నేతల్లో అభద్రతాభావం రోజురోజుకూ పెరిగిపోతోందని, అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి కల్గిన నేత అని కొనియాడారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నేతగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.