Saturday, November 23, 2024

మార్కెట్లు జోష్.. 515 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లన్నీ కళకళలాడాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ సూచీలు గురువారంనాడు లాభాల్లో సాగాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సైతం ఉదయం నుంచి ఎక్కడా లాభాల జోరు తగ్గలేదు. ఆరంభం నుంచి కొనుగోళ్ల మద్దతు స్థిరంగా కొనసాగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం జూన్‌తో పోలిస్తే దిగిరావడం సూచీల సెంటిమెంటును పెంచింది. పైగా అంచనాల కంటే కూడా తక్కువ నమోదు కావడం మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇదే కారణంతో అంతర్జాతీయంగానూ అన్ని మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. మరోవైపు దేశీయంగాను బలమైన కార్పోరేట్‌ ఫలితాలు, ముడి చమురు ధరలు దిగువస్థాయిలో కొనసాగుతుండడం, డాలర్‌ ఇండెక్స్‌ దిగిరావడం సూచీలకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 515 పాయింట్లు లాభపడి 59,332కి ఎగబాకింది. నిఫ్టీ 124 పాయింట్లు లాభంతో 17,659 వద్ద ముగిసింది.

యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, విప్రో, ఎస్‌బీఐ, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, టాటాస్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయిన స్టాక్స్‌ జాబితాలో ఉన్నాయి. కిర్లోస్కర్‌ న్యూమాటిక్‌ షేర్లు గురువారంనాడు ఏడు శాతం మేర లాభపడ్డాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాల్లో 130.13శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు కారణం. జూన్‌ త్రైమాసికంలో వండర్‌లా హాలిడేస్‌ బలమైన కార్పోరేట్‌ ఫలితాలను ప్రకటించింది. నికర లాభాలు రూ.8.51 కోట్ల నుంచి రూ.64.38 కోట్లకు చేరాయి. దీంతో కంపెనీ షేర్లు ఈ రోజు 20శాతం పెరిగి రూ.334.95 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పీబీ ఫిన్‌టెక్‌ (పాలసీబజార్‌) ఆదాయం 100శాతం పెరిగి నేపథ్యంలో కంపెనీ షేర్లు గురువారంనాడు ఇంట్రాడేలో 5శాతానికి పైగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ఈ రోజు ఇంట్రాడేలో దాదాపు 2శాతం మేర లాభపడి 52వారాల గరిష్టానికి చేరాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేసన్‌ రూ. 6 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన ఏడో భారత కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్‌ నిలిచింది. ఈ కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటి వరకు 17శాతం ఎగబాకింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement