భారత్ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ బ్యాంక్, రియాల్టిd 4 శాతం నుంచి 5 శాతం చొప్పున పడిపోయాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి పెరుగుతున్నా కొద్దీ.. బుల్‌పై బేర్ పంజా విసురుతూ వచ్చింది. ఉదయం సెన్సెక్స్ 53,172.51 పాయింట్ల వద్ద భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,203.87 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,367.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని సూచీలు తాకాయి. చివరికి 1,491.06 పాయింట్ల నష్టంతో 52,842.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 1,900 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 15,867.95 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,944.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,711.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 382.20 పాయింట్లు నష్టపోయి 15,863.15 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకానొక దశలో 2000 పాయింట్ల వరకు నష్టపోయింది. క్యాపిటల్ మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.77.00 వద్ద కొనసాగుతున్నది.
రష్యాపై పెరుగుతున్న ఆంక్షలు..
ఫిబ్రవరి ప్రారంభం నుంచి సోమవారం వరకు రూ.29లక్షల కోట్ల సంపదను మదుపరులు కోల్పోయారు. సోమవారం ఒకే రోజు రూ.5.62 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్ర చేస్తూ వస్తున్నది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. యుద్ధం లేకపోయి ఉంటే.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్టాలకు చేరుకునేవి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో సోమవారం మార్కెట్లు పతనం అయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పెరుగుతున్నందున.. ఆ దేశంపై ప్రపంచ దేశాల ఆంక్షలు పెరుగుతూ పోతున్నాయి. అయినా రష్యా వెనుకడుగు వేయడం లేదు. రష్యా ఎగుమతులపై ఆంక్షలు విధించాలని అమెరికా, ఐరోపా దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే.. భారత్‌కు మరిన్ని నష్టాలు తప్పవని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆటో, ఫైనాన్స్ షేర్లకు నష్టాలు..
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మార్కెట్లు నష్టాలు చవిచూస్తున్నాయి. సోమవారం చైనా మార్కెట్లు 2.1 శాతం, జపాన్ 2.9 శాతం, ఆస్ట్రేలియా 1శాతం, జర్మనీ 3.5 శాతం, ఇటలీ 3.3 శాతం, యూకే 1.8 శాతం, ఫ్రాన్స్ 3.4 శాతం మేర నష్టపోయాయి. అదేవిధంగా భారతీయ స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే.. బీఎస్‌ఈ సెన్సెక్స్ టాప్ 30 స్టాక్స్‌లో ఐదు మాత్రమే లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. మిగిలిన 25 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు 8 శాతానికి పైగా నష్టపోయింది. మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్‌సర్వ్ 6 శాతానికి పైగా నష్టపోయాయి. రంగాల వారీగా చూసుకుంటే.. మెటల్, సీపీఎస్‌ఈ, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్ సూచీలు లాభపడ్డాయి. స్థిరాస్తి, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాలు నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 50 సూచీలోని 50 షేర్స్‌లో 12 షేర్లు లాభపడగా.. 38 షేర్లు నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..