ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం తరువాత కోలుకుని ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో.. తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపారు. మూడు సెషన్స్‌లో ఇన్వెస్టర్లు రూ.11 లక్షల కోట్లకు పైగా సంపదను నష్టపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్డౌన్ ఆంక్షలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ ఉదయం 54,309 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 54,226 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 54,857 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 105 పాయింట్లు ఎగిసి.. 54,365 పాయింట్ల క్లోజ్ అయ్యింది. నిఫ్టీ ఉదయం 16,248.90 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమై.. 61.80 పాయింట్లు నష్టపోయి.. 16,240.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 16,197.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.31 వద్ద ట్రేడ్ అవుతున్నది.
మెటల్ రంగంలో నష్టాలు..
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, ఐటీ, రియాల్టి సూచీలు 1 శాతం నుంచి 5 శాతం వరకు క్షీణించాయి. మిడ్ క్యాప్-100.. 1.87 శాతం, స్మాల్ క్యాప్ 2.24 శాతం క్షీణించాయి. నిఫ్టీ మెటల్ 5.20 శాతం, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.24 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.29 శాతం క్షీణించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..