న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ-గవర్నెన్స్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర పంచాయితీరాజ్ శాఖ జనవరి 30న మంథన్ పేరుతో చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ‘నూతన మార్గాల్లో పయనం’ అనే ఇతివృత్తంతో ఒక రోజు మొత్తం చర్చించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ-గ్రామ్‌స్వరాజ్ 2.0 అప్లికేషన్‌ను మరింత ప్రభావవంతంగా పనిచేసేలా రూపొందించడం ఈ చర్చా కార్యక్రమం ముఖ్యోద్దేశం. దేశంలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకో సిస్టం కారణంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వం నుంచి మెరుగైన ఈ- గవర్నెన్స్ సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
గరిష్ట పాలన- కనీస ప్రభుత్వం అన్న విధాన లక్ష్యంతో భవిష్యత్తు తరం డిజిటల్ టెక్నాలజీని ఉసపయోగించుకునేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ-గ్రామ్‌స్వరాజ్ సహా ప్రస్తుత ఈ-గవర్నెన్స్ అప్లికేషన్లను మెరుగుపరిచే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో మేథోమథనం కోసం మంథన్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అందుబాటు, విషయాంశాల లభ్యత, సులభతరంగా ఉపయోగించడం, సమాచార భద్రత మరియు గోప్యత, సమగ్ర సేవల బట్వాడా తదితర కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభావవంతమైన ఈ-గ్రామ్ స్వరాజ్ 2.0 ను సృష్టించేందుకు ఒక ఏకీకృత అవగాహన అవసరమని కేంద్రం భావిస్తోంది.
తద్వారా అప్లికేషన్ల పునర్వ్యవస్తీకరణ లేదా పునరుద్దరణను సమర్ధవంతమైన పద్ధతిలో చేపట్టడమే కాక పంచాయతీరాజ్ వ్యవస్థల రోజువారీ పనిని సరళతరం చేయడంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సంబంధిత రంగాల నిపుణులు, పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, పాలనారంగంలో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్స్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.