మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు సేఫ్
అనుచరవర్గంతో ఫోన్‌లో మాట్లాడిన అగ్రనేత
దామోదర్ మృతి చెందరాన్న ప్రచారానికి తెర
చనిపోయాడనే వార్తను ధ్రువీకరించని పోలీసులు
వాజేడు, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. రెండు రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేసిన వార్తలన్నీ ఫేక్ అని తేలిపోయింది. తాను బతికే ఉన్నానని, సేఫ్‌గా ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. తన అనుచరులతో ఆయన ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని ప్రచారం…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదరన్న చనిపోయినట్టు ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారానికి కారణం కూడా ఉందని చాలా మంది అంటున్నారు. మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో శనివారం ఒక లేఖ విడుదలయింది. దీంతో దామోదార్ మృతి చెందినట్లు చాలామంది నిర్థారణకు వచ్చారు. అయితే.. ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధ్రువీకరించలేదు. అంతేకాకుండా ఆ లేఖలో ఉన్న సమాచారం ఫేక్ అని పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
దామోదర్ నుంచి ఫోన్..
దామోదర్ సురక్షితంగా ఉన్నారని తన బంధుమిత్రులకు, అనుచరులకు, మావోయిస్టు పార్టీకి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి లేఖ విడుదల చేయవద్దని మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావు అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని తెలియడంతో ప్రచారానికి తెర పడినట్లు అయింది.
నిరంతరం నాలుగంచెల భద్రత
మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌కు నిరంతరం నాలుగు అంచెల భద్రతా ఉంటుందని తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆయన అనేక ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న దామోదర్ పోలీసు శాఖలో మోస్ట్‌వాంటేడ్ పర్సన్‌గా ఉన్నారు. చొక్కారావుపూ ₹50 లక్షల రివార్డు కూడా ఉంది.