Monday, November 25, 2024

Delhi: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప‌లు ప్రాజెక్టుల‌ జాప్యం.. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆదిలాబాద్ ఎంపీ (బీజేపీ) సోయం బాపూరావు విమర్శించారు. ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సోమవారం ఢిల్లీలో ఉన్న ఆయన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలను కలిశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర పెద్దలతో తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించానని అన్నారు. ఆదివాసీ సమూహం నుంచి తొలిసారిగా రాష్ట్రపతైన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి, ఆదివాసి చట్టాలను బలోపేతం చేయాలని కోరినట్టు తెలిపారు.

ఈ మేరకు ఆమె సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పౌరవిమానయాన శాఖ మంత్రిని కలిసి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరినట్టు తెలిపారు. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే తగిన సహకారం అందడం లేదని కేంద్ర మంత్రి చెప్పినట్టు సోయం బాపూరావు వెల్లడించారు. విమానాశ్రయ విస్తరణకు 650 ఎకరాల భూమి అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరిపి అందజేయాల్సి ఉంటుందని అన్నారు. స్థానిక ప్రజల నుంచి చాలా కాలంగా విమానాశ్రయం కోసం డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే భూసేకరణ జరిపి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఆదిలాబాద్ – ఆర్మూర్ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 50 శాతం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదని, వెంటనే ఆ నిధులు కేటాయించి త్వరగా రైలు మార్గం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తూ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. చాలామంది ఆదివాసి ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.

పోడు భూముల్లో వ్యవసాయం చేసేవారిపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు దిగుతోందని, ఇన్ని సంవత్సరాలైనా ఆదివాసులకు భూములు ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ త్రిబుల్ ఐటీ విద్యార్థుల పరామర్శకు వెళితే కనీసం స్థానిక యంత్రాంగం ప్రోటోకాల్ పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement