Friday, November 22, 2024

ఖాదీ అభివృద్ధికి పలు చర్యలు.. ఎంపీ నామా ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖద్దరు పరిశ్రమ రంగ అభివృద్ధికి దేశవ్యాప్తంగా పలు ఖాదీ సెంటర్లను నెలకొల్పినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఖాదీ ద్వారా ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఖద్దరు రంగం సాధించిన ఫలితాలు, నిఫ్ట్ బలోపేతానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కోరారు. ఆయన ప్రశ్నలకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ గురువారం స్పందించారు.

కేంద్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ఏర్పాటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సాంకేతిక సహకారంతో ఢిల్లీ, గాంధీనగర్, కోల్‌కత్తా, షిల్లాంగ్, బెంగుళూరులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఖాదీ సెంటర్లను నెలకొల్పినట్టు తెలిపారు. అందమైన డిజైన్లు, ఉత్పత్తి, నాణ్యత గల ఖద్దరు వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ను పెంచేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఖాదీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి వివరించారు. దీనిపై నాలెడ్జ్ పోర్టల్‌ను కూడా రూపొందించినట్టు చెప్పారు. దాని ద్వారా నాణ్యతా ప్రమాణాలు, లోపాలు గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు భానుప్రతాప్ సింగ్ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement