ఎల్బీనగర్, (ప్రభ న్యూస్) : గర్భిణీ స్త్రీలు, బాలింతలకు చిరుధాన్యాలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. వనస్థలిపురం రైతు బజార్ వద్ద నయా మిల్లెట్స్ వ్యవస్థాపకులు కే అమర్నాథ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రo అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం- 2023 –ను పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు రోజువారీ ఉచిత మిల్లెట్ అల్పాహార పథకాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్యవంతమైన శిశు జననం కోసం చిరుధాన్యాల ఆహారాన్ని తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలు శక్తివంతులుగా ఎదిగేందుకు మిల్లెట్స్ ఫుడ్ దోహదం చేస్తుందని. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుతారన్నారు. తక్కువ పెట్టుబడి, నీటి వినియోగం తక్కువతో చిరుధాన్యాలను పండించవచ్చునన్నారు. మిల్లెట్ ఫుడ్ శరీరానికి పవర్ బ్యాంకుల శక్తిని అందిస్తాయని తెలిపారు. ఇంట్లోనే గృహిణులు చిరుధాన్యాలతో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రధానమంత్రి చొరవతో ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని తెలిపారు. బిజెపి సీనియర్ జాతీయ నాయకులు పి. మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవతో 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించారన్నారు. కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తక్కువ తీసుకుని, సాంప్రదాయపద్ధమైన మిల్లెట్స్ ఆహారాన్ని వినియోగించాలన్నారు. విద్యావంతులె ఎక్కువ జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నారని, ఎక్కువ పోషక విలువలు గల చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు.
మిల్లెట్స్ ఫుడ్ ఉపయోగించే విషయంలో తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు. అనంతరం గవర్నర్ గర్భిణీలకు మిల్లెట్స్ ఆహార పదార్థాలను గర్భిణీలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఐ ఐ ఎం ర్ డైరెక్టర్ సి. తార సత్యవతి. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి. బిజెపి సీనియర్ నాయకులు పోచంపల్లి గిరిధర్, మహిళా మోర్చా నాయకులు నందికొండ గీతారెడ్డి, తదితరులు ఉన్నారు.