కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఉద్యోగాలు మళ్లీ ఊడుతున్నాయి. వాస్తవానికి 2020
మార్చిలో మొదలైన లాక్ డౌన్ నుంచే అన్ని రకాల పరిశ్రమలు కష్టనష్టాలను ఎదుర్కొంటున్నాయి. వలస కార్మికులు సొంతూరి బాట పట్టడం, పరిశ్రమలు దాదాపు నాలుగైదు నెలల పాటు మూతపడటంతో చిన్నా చితకా పరి శ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిలిచి పోయిన పరిశ్రమలను మళ్లీ పట్టా లెక్కించి పరుగులు పట్టించేందుకు నానా అవస్థలు పడ్డారు. ఉద్యోగులను, వేతనాలను తగ్గించడం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, కార్మికులపై ఆధార పడకుండా సాంకతికతను వినియోగించటం తదితర చర్యలతో నష్టాలను అధిగమించేందుకు పరిశ్రమ వర్గాలు కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తుంటే, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి. సేవలరంగం, ఉత్పత్తి రంగం అనే తేడా లేకుండా పరిశ్రమలు, వ్యాపారాల్లో ఉద్యో గాల కోత ఉద్ధృతమైంది. వెరసి ఉద్యోగులకు, కార్మికులకు జీవన భద్రత కరువైంది. హైదరాబాద్ నగరంలో
చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే వారిపై కరోనా ప్రభావం
తీవ్రంగా పడింది. సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల్లో కార్మికుల కోత పడుతోంది. టూరిస్ట్ హోటల్ రంగం, విద్యా వ్యవస్థ అతలా కుతలమైందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, నాట్స్ చింగ్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది వరకు కరోనా కారణంగా ఈ విద్యా
సంవత్సరంలో ప్రత్యక్షంగా పరోక్షంగానూ ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో 75లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ పేర్కొన్నది. ఫలితంగా నిరుద్యోగిత రేటు మరింత పెరిగిందని, భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలుగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయ పడింది.
మార్చినెలలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 9.18శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో 7.18 శాతంగా ఉంది. కరోనా కట్టడికి రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం, వ్యాపారాలు మందగించడం లాంటివి ఉద్యోగాలపై ప్రభావం చూపెడుతున్నా యని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీంతో యువత స్వశక్తితో ఎదిగేందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో స్వయం ఉపాధి హామీ పథకం కింద ఈమధ్య కాలంలో 1.7 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారే ఉన్నారు. ఈ పథకం కింద వచ్చే రుణంతో చిన్న చిన్న పరిశ్రమలు అంటే పేపర్ ప్లేట్లు తయారి యూనిట్, హార్వెస్టర్స్, లాండ్రీ, ఫూట్వేర్,మేకింగ్ యూనిట్స్, రెడీమేడ్ గార్మెట్స్, పౌల్టీ, డెయిరీ ఇతరత్ర సూక్ష్మ తరహా పరిశ్రమలు పెట్టుకుని ఉపాధి మార్గాలను అన్వేషించుకుంటున్నారు.